మంత్రి సబితా సన్నిహితులు, ఫార్మా కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ సోదాలు

రాష్ట్రంలో ఓవైపు ఎన్నికల కోలాహలం నడుస్తుంటే మరోవైపు ఐటీ అధికారుల సోదాలు రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతున్నాయి.

Update: 2023-11-13 14:30 GMT

దిశ, శేరిలింగంపల్లి : రాష్ట్రంలో ఓవైపు ఎన్నికల కోలాహలం నడుస్తుంటే మరోవైపు ఐటీ అధికారుల సోదాలు రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల పై ఐటీ అధికారులు తాజాగా సోమవారం తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల నివాసాల పై ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. గచ్చిబౌలిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ప్రదీప్‌ నివాసంలో ఆదాయ పన్నుశాఖ అధికారులు సోదాలు చేశారు. ప్రదీప్ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి దగ్గరి బంధువు, ఆయన నివాసంతో పాటు ఇతర బంధువుల నివాసాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.

హైదరాబాద్‌ లోని ఓ ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీపై అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. నగరంలో 15 వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టగా, ఓ ఫార్మా కంపెనీ చైర్మన్, డైరెక్టర్ ఇళ్లతో పాటు సిబ్బంది ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సుమారుగా 10 ఐటీ అధికారుల బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. పన్ను ఎగవేత ఫిర్యాదుల పై వచ్చిన ఆర్థిక లావాదేవీల రికార్డులను ఐటీ అధికారులు తనిఖీ చేశారు. ఆర్‌సీపురంలోని నాగులపల్లి, అమీన్‌ పూర్‌ లోని పటేల్‌గూడ, గచ్చిబౌలిలో సోదాలు జరిగాయి. గచ్చిబౌలి ప్రాంతంలోని మై హోమ్ భూజా, అపార్ట్మెంట్లలోని ఫార్మా కంపెనీలకు చెందిన కొందరు ఉన్నతాధికారుల ఫ్లాట్లలో ఐటీ అధికారుల సోదాలు నిర్వహించారు.

Tags:    

Similar News