దేవాలయ ఉద్యోగులను ప్రైవేట్ ఉద్యోగులు అనడం సరికాదు : అర్చక జేఏసీ

దేవాలయ ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులని ఓ పత్రిక

Update: 2024-10-24 12:53 GMT

దిశ,హైదరాబాద్ బ్యూరో : దేవాలయ ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులని ఓ పత్రిక (దిశ కాదు) రాయడాన్ని తెలంగాణ అర్చక ఉద్యోగుల జేఏసీ ఖండించింది . ఈ మేరకు గురువారం తిలక్ రోడ్డు లోని దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయం ఆవరణలో జేఏసీ నాయకులు మీడియాతో మాట్లాడారు. దేవాలయ ఉద్యోగులను ప్రైవేట్ ఉద్యోగులని ఇటీవల శాఖలో పదోన్నతుల విషయమై కార్యానిర్వాహణాధికారి మాట్లాడినట్లుగా ఆ పత్రికలో ప్రచురితమైందన్నారు . దీనిని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు .శాఖలో పని చేస్తున్న వారిలో కేవలం 150 మంది మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు, మిగిలిన 500 మంది ప్రైవేట్ ఉద్యోగులనడం తమను ఆందోళనకు గురిచేస్తోందని, తమ మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు . జీఓ 262 ప్రకారం కార్యనిర్వాహణాధికారులుగా పదోన్నతులు పొందడం చట్టం తమకు అవకాశం కల్పించిందన్నారు. ఇలా ఆలయ ఉద్యోగులపై బురద జల్లడాన్ని జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు . దీనివెనుక ఉన్న దుష్టశక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు .

10వ తరగతి ఉత్తీర్ణులైన వారిని నిబంధనల మేరకు అర్హత పరీక్షలు రాసి ఉద్యోగాలకు ఎంపికైనట్లు వారు వివరించారు . 33 మంది నుండి రూ 2.5 లక్షల నుండి రూ 5 లక్షలు వసూలు చేసి అక్రమాలకు పాల్పడ్డారని వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమైనవన్నారు . ఇక ముందు ఇలాంటి అవాస్తవాలను ప్రచురించవద్దని వారు కోరారు . ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ పరాశరం రవీంద్రాచార్యులు , వర్కింగ్ ప్రెసిడెంట్ అగ్నిహోత్ర చంద్రశేఖర శర్మ, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాండూరి కృష్ణమాచారి , తెలంగాణ ఈఓస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ నరేందర్ , ఫౌండర్ ప్రెసిడెంట్ ఎన్ అంజనారెడ్డి , ప్రధాన కార్యదర్శి రాజేష్ కుమార్ ,సంయుక్త కార్యదర్శి ఎం శ్రీనివాస్, గ్రేటర్ అధ్యక్షుడు బండారి జగపతి ,అర్చక ఉద్యోగుల అధ్యక్షుడు చింతపట్ల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు .


Similar News