దక్షిణ మధ్య రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.83 వేల కోట్లు కేటాయించాం : మంత్రి కిషన్ రెడ్డి
దక్షిణ మధ్య రైల్వే చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై రైల్వే
దిశ,సికింద్రాబాద్: దక్షిణ మధ్య రైల్వే చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై రైల్వే అధి కారులుతో పార్లమెంట్ సభ్యులు గురువారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో సమావేశం అయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి తెలంగాణ , కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పది మంది పార్లమెంటు సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో వారు వారి నియోజకవర్గాల్లో రైల్వే కు సంబంధించి ఉన్న సమస్యలు,పెండింగ్ ప్రాజెక్టులు, అభివృద్దిపై సమీక్షించారు. రైళ్ల హాల్టింగ్, కొత్త రైల్వే లైన్లు,రైల్వే అండర్ బ్రిడ్జీలు, అండర్ సాస్ వంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పార్లమెంటు సభ్యులు వారి వారి నియోజకవర్గాల పరిధిలో రైల్వే సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.
అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ... దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొనసాగుతున్న వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.83 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. గత సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే కొత్త లైన్లు, డబుల్ లైన్లు, గేజ్ మార్పిడి వంటి పనుల కింద 415 కిలోమీటర్ల అదనపు ట్రాక్ ను అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 40 స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఎంపికచేసి వాటిని రూ. 2,635 కోట్ల వ్యయంతో భారీ ఎత్తున పునరాభివృద్ధి పనులను చేపట్టామని, పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రూ. 650 కోట్ల వ్యయంతో వరంగల్ లో రైల్ మాన్ ఫ్యాక్చరింగ్ యూనిట్ రాబోతుందన్నారు. రాబోయే రోజుల్లో అక్కడ వ్యాగన్లు,కోచ్లు తయారీ జరుగుతుందన్నారు. దీని వల్ల సుమారు 3వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున ఫైనల్ లొకేషన్ సర్వేలచేయాలని రైల్వో బోర్డు అంగీకరించింది.
ఫైనల్ కోలేషన్ సర్వేలో చేపట్టే 15 ప్రాజెక్టులకు 2640 కిలోమీటర్ల అభివృద్ధికి ప్రపోజల్ పెట్టామన్నారు. దీనికి 50వేలకోట్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. రూ.720కోట్ల వ్యయంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్ వరకు ఈ స్టేషన్ ను అందుబాటులోకి తెస్తామన్నారు. రూ.430 కోట్ల నిధులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను అత్యంత అధునాత సదుపాయాలతో నిర్మిస్తున్నాం. దీనికి అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని రాష్ర్ట ప్రభుత్వాన్నికోరామని, ఈ రోడ్డు పనులు పూర్తి కాకపోయినప్పటికీ వచ్చే నెలలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రారంభిస్తామన్నారు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ ను పొడిగించాలని నిర్ణయించాం. దానికి సంబంధించిన పనులు కూడా త్వరలోనే పారంభిస్తామన్నారు.
అనంతరం మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. జర్నలిస్టులు, దివ్యాంగులకు రైల్వే పాసులను పునరుద్దరించాలని అధికారులు కోరామన్నారు. కొన్నేళ్లుగా జర్నలిస్టులు, దివ్యాంగులకు పాసులు నిలిపివేయడం వల్ల వారికి ప్రయాణ రాయితీలు లభించక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాగా తమ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఈదుల నాగుల పల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలని కోరారు. ఇందు కోసం ఇప్పటికే 500 ఎకరాల భూమిని సేకరించామన్నారు. దీంతో పాటు కొల్లూరు, ఈదుల నాగుల పల్లి వద్ద రైల్వే బ్రిడ్జి ని అభివృద్ధి చేయాలని అధికారులను కోరారు. మెదక్ నియోజకవర్గం గుండా ప్రయాణించే అజంతా, రాయలసీమ ఎక్స్ ప్రెస్ రైళ్ల హాల్టింగులు పెంచాలని కోరారు. మరో వైపు మనోహరాబాద్, కొత్తపల్లి రైల్వే లైనును పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో వీరితోపాటు ఎంపీలు జీ నగేష్, రఘు రాంరెడ్డి, బల్ రామ్ నాయక్, డీకే అరుణ, ఈటల రాజేందర్, కడియం కావ్య, కే ఆర్ సురేష్ రెడ్డి, కర్ణాటక ఎంపీలు సాగర్ ఈశ్వర్ ఖంద్రే, రాధ కృష్ణ దొడ్డ మని, తదితరులు పాల్గొన్నారు.