ఆ హోటల్స్ కి వెళ్తున్నారా అయితే బీకేర్ ఫుల్..
హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస దాడులు కొనసాగిస్తున్నారు.

దిశ, శేరిలింగంపల్లి : హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస దాడులు కొనసాగిస్తున్నారు. మాదాపూర్ లోని కావూరి హిల్స్ లో క్షత్రియ ఫుడ్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు నిర్వహించారు. కిచెన్ మొత్తం అపరిశుభ్రంగా ఉందని, కిచెన్ లో ఎక్కడ చూసినా ఈగలు, బొద్దింకలు సంచరిస్తున్నాయని అధికారుల దృష్టికి వచ్చింది. వంటలలో కృత్రిమ కలర్స్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. కూరగాయలు, నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఒకటే ఫ్రిజ్ లో నిల్వ ఉంచారని అన్నారు. పెస్ట్ కంట్రోల్ రికార్డు, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్, వాటర్ అనాలిసిస్ రిపోర్ట్ లేదని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. అలాగే గచ్చిబౌలి వరలక్ష్మి టిఫిన్ సెంటర్ లో కిచెన్ ఏమాత్రం పరిశుభ్రంగా లేవని టైల్స్ పగిలిపోయి, గోడలు ఆయిల్, మరకలతో నిండిపోయాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. ఆహార వ్యర్థాలను కిచెన్ దగ్గరే నిల్వ ఉంచారని, వాటి నిర్వహణ కూడా సరిగా లేనట్టు అధికారులు గుర్తించారు. వంట పదార్థాలను ఎలాంటి జాగ్రత్తలు లేకుండా ఎక్కడ పడితే అక్కడ వదిలేయడంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.