ఈదులకుంటకు ఎట్టకేలకు మోక్షం..!

రికార్డుల్లో ఉన్నా వాస్తవంలో కనబడకుండా పోయిన ఈదులకుంట చెరువు ఆచూకీ లభించింది..

Update: 2025-01-04 02:40 GMT

దిశ, శేరిలింగంపల్లి: తెలంగాణ వ్యాప్తంగా గొలుసుకట్టు చెరువులను తవ్వించి వ్యవసాయ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు నాటి పాలకులు. నీటి పారుదలలలో తమకు తామే సాటి అని చాటుకున్నారు. తదనంతర కాలంలో సుభిక్షంగా ఉన్న తెలంగాణ క్రమంగా తన గత వైభవాన్ని కోల్పోయింది. నాటి అనవాళ్లను నేడు భూతద్దం పెట్టి వెతుక్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ మహానగరం చుట్టూ ఉన్న వందలాది చెరువులు కుంటల్లో ఇప్పుడు చాలా వరకు మాయమయ్యాయి. అందులో ఈదులకుంట ఒకటి. ఈ చెరువు కొంతకాలంగా ఎక్కడ ఉందో అన్నది కూడా తెలియకుండా పోయింది. అయితే ఎట్టకేలకు దానికి మోక్షం లభించనుంది.

చెరువు దొరికింది..

రికార్డుల్లో ఉన్నా వాస్తవంలో కనబడకుండా పోయిన ఈదులకుంట చెరువు ఆచూకీ లభించింది. సీపీఎం నాయకుల పోరాటం, దిశ దినపత్రికలో 2022 డిసెంబర్‌లో, 2024 జులైలో, అలాగే ఆగస్టులో ప్రచురితం అయిన వరుస కథనాలను సీరియస్‌గా తీసుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈదులకుంట చెరువును పలుమార్లు స్వయంగా పరిశీలించారు. చెరువును కాపాడేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఇరిగేషన్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ శాఖల అధికారులతో చర్చించారు. వారితో సర్వే చేయించినా ఎటూ తేలకపోవడంతో డెహ్రాడూన్‌లోని సర్వేఆఫ్ ఇండియా అధికారులకు లేఖ రాసి వారిని రప్పించి మరీ ఈదులకుంట ఆనవాళ్లపై ఆరాతీశారు. గురువారం ఇరిగేషన్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి జాతీయ రిమోట్‌ సెన్సింగ్‌ కేంద్రం మ్యాప్స్, సర్వే ఆఫ్‌ ఇండియా ట్రోపో రికార్డులను పరిశీలించారు. వాటిలో ఈదులకుంట ఆనవాళ్లు దొరికాయి. వాటి ఆధారంగా చెరువును సర్వే చేసి హద్దులను నిర్థారించారు. ఇన్నాళ్లు అసలు క్షేత్రస్థాయిలోనే లేదన్న ఈదులకుంట ఇప్పుడు పూర్తి ఆధారాలతో బయటపడింది.

ఏళ్లుగా ఆక్రమణలకు యత్నాలు..

శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి మండలాల మధ్య ఓవర్ ల్యాపింగ్ వల్ల మాదాపూర్ డివిజన్ ఖానామెట్ గ్రామంలోని సర్వే నెంబర్ 7లోని కోట్లాది రూపాయల విలువైన 6.10 ఎకరాల ఈదులకుంట చెరువు కనపడకుండా పోయిందని ఇరిగేషన్ అధికారులు చాలాకాలంగా చెబుతూ వస్తున్నారు. ఇదే అదునుగా ఓ రియల్‌ఎస్టేట్ సంస్థ ఆ స్థలం తమదేనని, కూకట్‌పల్లి మండలం మూసాపేట్ సర్వే నెంబర్ 1లో తమకు సంబంధించిన ల్యాండ్ ఇక్కడే ఉందంటూ వాదిస్తూ వస్తుంది. కానీ అది ముమ్మాటికీ చెరువు అని రెవెన్యూ రికార్డుల్లో ఉన్న అంశాన్ని ప్రస్తావిస్తూ పలుమార్లు దిశ దినపత్రిక సమగ్ర కథనాలను ప్రచురించింది. అటు సీపీఎం నాయకులు చల్లా శోభన్, కొంగరి కృష్ణ ఇతర నాయకులు కూడా ఈదులకుంట చెరువు పరిరక్షణ కోసం పోరాడుతున్నారు. ఇన్నాళ్లకు కోట్లాది రూపాయల విలువైన చెరువు పూర్తి ఆధారాలతో బయటపడడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.

ఎలా మాయమైంది..

హైటెక్ సిటీ ఏర్పాటు తర్వాత మాదాపూర్ ప్రాంతం దినదినాభివృద్ధి చెందుతూ వస్తుంది. ఇదే సమయంలో భూముల ధరలు ఆకాశాన్ని అంటాయి. అటు రియల్‌ఎస్టేట్ వ్యాపారం ఊపందుకోవడంతో గొలుసుకట్టు చేరువులైన మొండికుంట, దానికింద ఉన్న తమ్మిడికుంట, వాటికింద ఉన్న ఈదులకుంట చెరువుల్లో నీరు చేరడం గగనంగా మారింది. అటు స్థిరాస్తి వ్యాపారులు క్రమంగా చెరువులను చెరబడుతూ వచ్చారు. తమ్మిడికుంట ఆక్రమణల్లో చిక్కుకుపోవడం, రోడ్డు విస్తరణ, ఫ్లై ఓవర్ నిర్మాణ పనులతో వరద కాలువ మూసుకుపోవడంతో ఈదులకుంటకు వెళ్లాల్సిన వరద, అయ్యప్ప సొసైటీ, సర్వే ఆఫ్‌ ఇండియా కాలనీల్లోకి మళ్లింది. అదే అదునుగా కొందరు కుంటపై కన్నేశారు. అటు నీటిపారుదలశాఖ, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు చెరువును రికార్డుల్లో లేకుండా చేశారు.

చెరువులు గల్లంతు..

శేరిలింగంపల్లి మండల పరిధిలోని పలు చెరువులు క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఒక్కో చెరువు తన రూపురేఖలు కోల్పోతోంది. చెరువుల పక్కనే ఉన్న స్థలాలను కొనుగోలు చేస్తున్న కొన్ని రియల్‌ఎస్టేట్ సంస్థలు ఆ స్థలం చూపిస్తూ క్రమంగా చెరువు శిఖాలను కూడా కబ్జా చేసేస్తున్నారు. అలా ఇప్పటికే పలు చెరువులు నామరూపాలు లేకుండా పోయాయి. అదే వరుసలో శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలు చెరువులు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. ఇప్పటికే పలు బడా రియల్‌ఎస్టేట్ సంస్థలు చెరువు శిఖాలలోనే బహుళ అంతస్థుల భవన నిర్మాణాలు చేపట్టాయి. ఇలాంటి వాటికి అన్ని శాఖల నుంచి అనుమతులు ఇచ్చేస్తున్నాయి. ఒక శాఖతో మరో శాఖ పోటీపడి మరీ అనుమతులు ఇచ్చేస్తున్నాయి.

మా పోరాటం ఫలించింది..

ఈదులకుంట కనబడకుండా పోయిన వ్యవహారంపై గత మూడు సంవత్సరాలుగా సీపీఎం పోరాటం చేస్తూనే ఉంది. కానీ అన్నిశాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చారు. ప్రభుత్వ స్థలం అని తెలిసినా అధికారులు మిన్నకున్నారు. దిశ దినపత్రిక సహకారం, మా పోరాటంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించి కోట్లాది రూపాయల స్థలాన్ని, ఓ చెరువుకు పునరుజ్జీవం లభిస్తుండడం చాలా ఆనందంగా ఉంది.

- శోభన్ చల్లా, సీపీఎం జిల్లా నాయకులు


Similar News