HYDRA: ‘హైడ్రా’కు అధునాతన యంత్రాలు.. టెండర్లకు ఆహ్వానం

హైదరాబాద్‌లో ఆక్రమణలకు గురైన చెరువులు, నాలాలను పరిరక్షించడమే ధ్యేయంగా ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) దూకుడుగా వ్యవహరిస్తోంది.

Update: 2024-09-20 02:34 GMT

దిశ, సిటీ బ్యూరో: హైదరాబాద్‌లో ఆక్రమణలకు గురైన చెరువులు, నాలాలను పరిరక్షించడమే ధ్యేయంగా ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు 23 చోట్ల 262 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసిన హైడ్రా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేసేందుకు, ఆ వ్యర్థాలను తొలగించేందుకు కావాల్సిన అధునాతన యంత్రాలను సమకూర్చుకోవడానికి టెండర్లను ఆహ్వానించింది. ఆఫ్‌లైన్‌లో టెండర్లు ఆహ్వానించిన ‘హైడ్రా’ సెప్టెంబర్ 20 నుంచి సెప్టెంబర్ 27 వరకు బిడ్లను స్వీకరించనున్నట్లు ప్రకటన జారీ చేసింది. ఏడాది కాల పరిమితితో ఈ బిడ్లను ఆహ్వానించారు. ఈ టెండర్ యంత్రాలను సమకూర్చడంతో పాటు ‘హైడ్రా’లో ఎన్‌ప్యానల్‌మెంట్ కోసం ఉపయోగపడుతుందని వెల్లడించారు.

ప్రొక్లెయినర్లు.. జేసీబీలు

చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేసేందుకు అత్యాధునిక యంత్రాలు అవసరం. అందులో భాగంగానే 20 మీ. ఎత్తులో నిర్మాణాలను కట్ చేయడానికి హైడ్రాలిక్ మిషన్, జా క్రషర్, రెండు షేర్ కట్టర్లు, బ్లేడు, బకెట్‌తో కూడిన రాక్ బ్రేకర్, రెండు ప్రొక్లెయినర్లు, రెండు జేసీబీలు, రెండు మినీ ప్రొక్లెయినర్లు, రెండు మినీ రాక్ బ్రేకర్లు, కూల్చివేతలకు సంబంధించిన ఇతర అధునాతన యంత్రాలు కావాలని టెండర్‌లో పేర్కొంది. ఐదు అంతస్తుల భవనాన్ని (40 వేల చదరపు అడుగులు) ఐదు గంటల్లో కూల్చే విధంగా పనిచేసే యంత్రాలు కావాలని హైడ్రా పేర్కొంది.

అనుభవం తప్పనిసరి

ఈ టెండర్లలో పాల్గొనే ఏజెన్సీలకు గతంలో పనిచేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. ఈ యంత్రాల తయారీదారులు, అధీకృత పంపిణీదారులు అధీకృత డీలర్లు కూడా టెండర్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పించింది. బిడ్డర్లు తప్పనిసరిగా జీఎస్టీ, పాన్, ఐటీ రిటర్న్‌లతో సహా చెల్లుబాటు అయ్యే చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్‌ కలిగి ఉండాలి. గత మూడు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన బ్యాలెన్స్ షీట్, లాభం, నష్ట ప్రకటన, టర్నోవర్ వంటి ఆర్థిక పత్రాల సర్టిఫికేట్, రిజిస్టర్డ్ చార్టర్డ్ నుంచి సరైన ధృవీకరణ తప్పక ఉండాలి. బిడ్డర్ తప్పనిసరిగా ధృవీకరించబడిన వార్షిక టర్నోవర్ నివేదికను అందించాలి. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో కనిష్ట టర్నోవర్ రూ.2 కోట్లు ఉండాలి. బిడ్డర్ తప్పనిసరిగా కనీసం ఒక కూల్చివేత ప్రాజెక్ట్‌ను అమలు చేసి కనీస ఖర్చు రూ.కోటి ఉండాలి. ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వ రంగంలో, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్, తెలంగాణలో ఎక్కడైనా కార్పొరేట్ రంగంలో పనిచేసిన అనుభవం ఉండాలి. బిడ్డర్ వర్క్ ఆర్డర్, వర్క్ కంప్లీషన్ సర్టిఫికేట్ నోటరీ చేయబడిన కాపీలను తప్పనిసరిగా సమర్పించాలి. బిడ్డర్ తప్పనిసరిగా ప్రభుత్వం కోసం కనీసం ఒక కూల్చివేత ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ఉండాలి.

262 కట్టడాల కూల్చివేత..

హైడ్రా మొత్తం 74 రోజుల ‘డిమాలిషన్ ఆపరేషన్’లో 23 ప్రాంతాల్లోని 262 కట్టడాలను కూల్చివేసింది. పొలిటికల్ లీడర్లతో పాటు సెలెబ్రిటీలు, వ్యాపారవేత్తల షెడ్లు, కమర్షియల్ కాంప్లెక్సులను నేలమట్టం చేసింది. 111.72 ఎకరాల చెరువుల భూములను రికవరీ చేసిన విషయం తెలిసిందే. కాంపౌండ్ వాల్స్, షెడ్లు, శ్లాబ్ స్ట్రక్చర్‌‌లను కూల్చివేసింది. 262 కట్టడాలకు సంబంధించిన వ్యర్థాలను 20 కి.మీ సమీపంలోని కన్‌స్ర్టక్షన్ అండ్ డిమోలిషన్ (సీఅండ్ డీ) ప్లాంట్‌కు తరలించే విధంగా టిప్పర్లను సైతం హైడ్రా సమకూర్చుకోనుంది.


Similar News