భారీ వర్షం ఎఫెక్ట్.. ట్రాఫిక్‌తో ప్రయాణికుల కష్టాలు
మహానగరంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. ఫలితంగా రోడ్లపై వర్షపు నీరు నిల్వటంతో ఎక్కడ గుంత ఉందో తెలియక వాహనదారులు తీవ్ర ఇబ్బందల పాలవుతున్నారు. వీవీఐపీ, వీఐపీ జోన్
దిశ, సిటీబ్యూరో : మహానగరంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. ఫలితంగా రోడ్లపై వర్షపు నీరు నిల్వటంతో ఎక్కడ గుంత ఉందో తెలియక వాహనదారులు తీవ్ర ఇబ్బందల పాలవుతున్నారు. వీవీఐపీ, వీఐపీ జోన్ లోని మెయిన్ రోడ్ల మాట అలా ఉంచితే బస్తీలు, కాలనీల రోడ్లను పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. గుంతలమయమైన రోడ్లపై ప్రయాణిస్తూ వాహనాలు మరమ్మతుల పాలు కావటంతో పాటు ప్రయాణికులు అనారోగ్యం పాలవుతున్నట్లు వాహనదారులు వాపోతున్నారు. చినుకు పడిందంటే చాలు వాహనాలు ముందుకు కదలకపోవటానికి రోడ్లపై ఏర్పడిన గుంతలే కారణమన్న విషయాన్ని జీహెచ్ఎంసీ గుర్తించినా, శాశ్వత పరిష్కారాన్ని సమకూర్చటంలో ఎందుకు విఫలమవుతుందంటూ వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ఈ గుంతలమయమైన రోడ్లపై తరుచూ ప్రయాణించే వాహనదారుల్లో ఎక్కువ మందికి స్పైన్ ప్రాబ్లమ్స్ వచ్చినట్లు వాపోయారు.
వెయ్యి కిలోమీటర్ల రోడ్డుకు మరమ్మతులు
మహానగరంలో మొత్తం సుమారు 9 వేల కిలోమీటర్ల పొడువున రోడ్లున్నాయి. వీటిలో సీసీ రోడ్లు దాదాపు 3 వేల కిలోమీటర్ల పొడువుండగా, మిగిలిన ఆరువేల పైచిలుకు కిలోమీటర్లు బీటీ రోడ్లున్నాయి. వీటిలో ఇప్పటి వరకు సుమారు వెయ్యి కిలోమీటర్ల పొడువున రోడ్లుపై సుమారు 45 వేల గుంతలు ఏర్పడినట్లు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. వీటిలో సగం రోడ్లు సీఆర్ఎంపీకి చెందినవే ఉన్నట్లు సమాచారం. రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని జీహెచ్ఎంసీ ఆదేశించినా, ఎక్కడా కూడా పనులు జరగటం లేదు.
ఆర్నెళ్లుగా అష్టకష్టాలు..
ఉప్పల్ చౌరస్తా నుంచి ఘట్ కేసర్ వెళ్లే రోడ్డు ఆరు నెలలుగా బురదమయంగా తయారైంది. రాకపోకలు సాగించేందుకు వాహనదారులు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం. అసలే బురద ఆపై వారం రోజులుగా ఎడ తెరపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా బురదలో ప్రయాణిస్తూ వాహనదారులు సడెన్ గా బ్రేక్ వేయటంతో ద్విచక్ర వాహనదారులు జారిపడి ఘటనలు సైతం లేకపోలేవు. రామంతాపూర్ నుంచి ఫీర్జాదిగూడ వరకు ఫ్లై ఓవర్ ను నిర్మిస్తున్నట్లు గత మూడేళ్లుగా హడావుడి చేస్తున్న జీహెచ్ఎంసీ ఇక్కడ ఉన్న రోడ్డును కూడా తవ్వేసి వదలేయటంతో ఈ దుస్థితి తలెత్తినట్లు వాహనదారులు వాపోతున్నారు. ఇక ఐటీ కారిడార్ లోని పలు రోడ్లు కూడా గుంతలమయంగా తయారు కావటంతో వాహనదారులకు ప్రాణ సంకటంగా మారింది.
అంబర్ పేటలో అస్తవ్యస్తం..
వర్షాకాలం సమీపిస్తుందంటూ కొత్త రోడ్డు వేస్తున్నామంటూ హడావుడి చేసిన జీహెచ్ఎంసీ అధికారులు అంబర్ పేటలోని తిరుమల్ నగర్, ఛే నెంబర్, అంబర్ పేట పోలీస్ స్టేషన్ మెయిన్ రోడ్డు ప్రాంతాల్లో సుమారు అర కిలోమీటరు పొడువున రోడ్డు తవ్వి వదిలేశారు. దీంతో రోడ్డుంతా గుంతలమయంగా మారటంతో పాటు గుంతల్లో వర్షపు నీరు నిండి ఉండటంతో వాహనదారులు ఇబ్బందులపాలవుతున్నారు. ఎక్కడ గుంత ఉందో, ఎక్కడ మూతలేని మ్యాన్ హోల్ ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. ఛిద్రమైన రోడ్డు ఒక వైపు పరేషాన్ చేస్తుంటే మరో వైపు ప్రస్తుతమున్న పాత విద్యుత్ స్తంభాలను తొలగించి, వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసే పనులు చేపడుతున్నారు. దీంతో రాకపోకలకు ఇబ్బందులు రెట్టింపయ్యాయి. దీనికి తోడు సీపీఎల్ మెయిన్ రోడ్డులో డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తుండటంతో రోడ్డుపై రాకపోకలు సాగించే వారు ముక్కుకు గుడ్డపెట్టుకుని వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. జాతీయ రహదారుల సంస్థ అంబర్ పేట ఫ్లై ఓవర్ పనులు చేపడుతున్న సంగతి తెల్సిందే. గుంతలమయమైన రోడ్డతో వాహనాలు మరమ్మతుల పాలవుతున్నట్లు పలువురు వాహనదారులు వాపోతున్నారు.