Hyderabad: మేయర్‌కు బడ్జెట్ భయం.. ఆమోదం తెలపని స్థాండింగ్ కమిటీ
మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి బడ్జెట్ భయం పట్టుకుంది.
దిశ, సిటీబ్యూరో : మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి బడ్జెట్ భయం పట్టుకుంది. స్టాండింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలంటే సంశయిస్తున్నారు. గత నెల 30న జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో జీహెచ్ఎంసీ బడ్జెట్ రూ.8,340 కోట్లను ఆమోదించాల్సి ఉండే. కానీ అధికారులు సకాలంలో బడ్జెట్ రూపకల్పన చేయకపోవడం ఒకెత్తయితే స్టాండింగ్ కమిటీ సమావేశం ఏకగ్రీవంగా తిరస్కరించడం మరో ఎత్తు. గతంలో సమావేశంలో బడ్జెట్‌ను ఆమోదించకపోవడంతో పాటు వారం రోజుల్లో సమావేశం నిర్వహించి బడ్జెట్‌ను ఆమోదించాలని నిర్ణయించారు. కానీ రెండు వారాలు కావొస్తున్న ఇంత వరకు స్టాండింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయకపోవడంతో కార్పొరేటర్లు విమర్శిస్తున్నారు. ఇప్పటికే బడ్జెట్‌ను ఆమోదించకపోవడం విడ్డూరమని ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు మండిపడుతున్నారు.
చట్టం ఏం చెబుతోంది..
జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం సెప్టెంబర్ 25లోపు సంబంధిత విభాగాల అధిపతులు బడ్జెట్ తయారిపై బాధ్యత తీసుకుని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాలి. ఆ తర్వాత బడ్జెట్ గురించి ప్రతిపాదనలు ప్రాసెస్ చేయాలని కమిషనర్ నుంచి సర్క్యూలర్ హెచ్ఓడీలకు అక్టోబర్ 1లోపు పంపించాల్సి ఉంటుంది. దీంతో పాటు ఆయా విభాగాల వారీగా బడ్జెట్‌కు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించి హెచ్ఓడీల ద్వారా కమిషనర్‌కు అక్టోబర్ 10లోపు పంపించాలి. కమిషనర్ వాటిని పరిశీలించిన తర్వాత విభాగాలు సమీక్షించడంతో ప్రతిపాదనల్లో ఏమైనా మార్పులుంటే సరిచేసి కమిషనర్ అక్టోబర్ 25లోపు ఫైనల్ చేయాల్సి ఉంటుంది. అనంతరం నవంబర్ 10లోపు బడ్జెట్ ప్రతిపాదనలను స్టాండింగ్ కమిటీ ముందు కమిషనర్ పెట్టాల్సి ఉంటుంది. అయితే బడ్జెట్ ప్రతులను సభ్యులు అధ్యయనం చేయడంతో సమావేశంలో చర్చించి, మార్పులు, చేర్పులుంటే సరిచేసి డిసెంబర్ 10 లోపు బడ్జెట్ బుక్ లెట్లను కార్పొరేటర్లకు పంపించాల్సి ఉంటుంది. స్టాండింగ్ కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు బడ్జెట్ ప్రతులను అధ్యయనం చేయడంతో ఆమోదించడానికి నెల రోజులపాటు సమయం ఉంటుంది. డిసెంబర్ 15లోపు బడ్జెట్ ప్రతిపాదనలను జనరల్‌బాడీ సమావేశంలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఆ సమావేశంలో బడ్జెట్ గురించి కార్పొరేషన్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. అయితే జనరల్ బాడీ సమావేశంలో సభ్యుల నుంచి కొత్తగా వచ్చే ప్రతిపాదనలు, మార్పులు, అదనపు కేటాయింపులు, ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుని ఫిబ్రవరి 20లోపు తుది బడ్జెట్‌ను రూపొందాల్సి ఉంటుంది. తర్వాత జనరల్ బాడీ ఆమోదించిన బడ్జెట్‌ను సమాచార నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలి. అనంతరం మార్చి 1లోపు బడ్జెట్ కాపీలను ఎగ్జామినర్ అకౌంట్స్ అండ్ ఆడిటర్స్‌కు పంపించాలి. తర్వాత 15 రోజుల్లో అదనపు కేటాయింపులతో కూడిన బడ్జెట్ సమాచారాన్ని కమిషనర్ ద్వారా కార్పొరేషన్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత వచ్చే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఏప్రిల్ తర్వాత నుంచి అమలుచేయడానికి చర్యలు తీసుకుంటారని జీహెచ్ఎంసీ ఓ సీనియర్ అధికారి తెలిపారు.
కౌన్సిల్‌లోనూ కష్టమే..
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీకి చెందిన సభ్యులే ఉన్నారు. మేయర్, స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్ తప్పా కాంగ్రెస్ పార్టీకి చెందినవారే లేరు. అందుకే స్టాండింగ్ కమిటీ సమావేశంలో బడ్జెట్ ఆమోదం పొందలేదనే విమర్శలొస్తున్నాయి. స్టాండింగ్ కమిటీ సమావేశం ఆమోదం పొందకపోతే కౌన్సిల్‌కు వెళ్లడానికి అవకాశముందని జీహెచ్ఎంసీ రిటైర్డ్ అధికారులు చెబుతున్నారు. అయితే స్టాండింగ్ కమిటీ సభ్యులను ఒప్పించేందుకు మేయర్ మంతనాలు చేస్తున్నట్టు సమాచారం.
మార్పులతో బడ్జెట్..
బడ్జెట్ మార్పులు చేయాలని కమిషనర్ నిర్ణయించినట్టు తెలిసింది. సమావేశంలో సభ్యులు లేవనెత్తిన అంశాలకు సమాధానాలు చెప్పేవిధంగా అధికారులు ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది. ప్రతిపాదనలను ప్రతి సభ్యునికి వ్యక్తిగతం వెళ్లి వివరించడంతో పాటు సూచనలు, సలహాలు తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. బడ్జెట్ ప్రతులను పరిశీలించడంతో పాటు అంగీకరించిన తర్వాత ముసాయిదా పత్రాలను ఇవ్వాలని అధికారులు నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతుంది. ఈనెలలో సమావేశం ఉంటుందా, జనవరిలో ఉంటుందా అనేది చూడాల్సిందే. సమావేశం జరిగితేగానీ బడ్జెట్ గురించి స్పష్టత వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.