ఒక ప్రమోషన్ వీడియో కు ఎంత ముట్టింది.. విష్ణు ప్రియ, రీతూ చౌదరి పై పోలీసుల ప్రశ్నల వర్షం..
బెట్టింగ్ యాప్ లకు ఎన్ని వీడియోలు చేశారు...ఎంత విడిదిగా వీడియోలను రూపొందించారు.

దిశ, సిటీక్రైం : బెట్టింగ్ యాప్ లకు ఎన్ని వీడియోలు చేశారు...ఎంత విడిదిగా వీడియోలను రూపొందించారు. ఒక ప్రమోషన్ వీడియోకు బెట్టింగ్ యాప్ సంస్థలు ఎంత నగదును ఇస్తారు. మీరు డిమాండ్ చేస్తారా..లేదా వారు ఫిక్స్ చేస్తారా. ఇలా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో దర్యాప్తు అధికారులు ఇప్పుడు ఈ కోణంలో విచారిస్తున్నట్లు తెలిసింది. మంగళవారం టేస్టీ తేజను విచారించగా, గురువారం రీతూ చౌదరీ, విష్ణు ప్రియ ను పోలీసులు విచారించారు. ఈ ప్రమోషన్ వీడియోలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల పై పోలీసులు ప్రశ్నించారని తెలిసింది. శుక్రవారం మరికొంత మందికి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించనున్నట్లు సమాచారం. బెట్టింగ్ యాప్ సంస్థలు ప్రమోషన్ చేయమని ఎవరీ ద్వారా సంప్రదించారు. మీకు ఏమి ఒప్పించారు.
మీరు బెట్టింగ్ యాప్ లను ప్రమోషన్ చేయడం ద్వారా సామాన్యులు డబ్బులు పొగొట్టుకుని ఆర్ధికంగా ఛిన్నాభిన్నమవుతారని తెలియదా.. చట్టపరమైన అంశాలు ఉంటాయని గుర్తించలేదా అంటూ పోలీసులు వివరాలను సేకరించారు. విష్ణు ప్రియ బెట్టింగ్ యాప్ ల కోసం దాదాపు 15 వీడియోలు చేసినట్లు విచారణలో అధికారులకు తెలిపినట్లు తెలిసింది. ఇక మియాపూర్ పీఎస్ లో నమోదైన కేసులో సినీ ఆర్టిస్టుల తో పాటు మిగతా యూట్యూబర్లు, ఇన్ ఫ్లూయర్స్ లకు కూడా సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. ఇటు హైదరాబాద్, అటు సైబరాబాద్ పోలీసులు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ల పై దర్యాప్తు చేస్తున్న వివరాలను గోప్యంగా పెడుతూ అధికారికంగా వివరాలను వెల్లడించడం లేదు.