పదుల ఎకరాల్లో కుంచించుకు పోయిన గంగారం చెరువు చెరువు
చెరువుల పరిరక్షణ కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం. వాటిని అభివృద్ధి చేస్తున్నాం అంటూ అధికారులు చెబుతున్న మాటలు అన్నీ గాలి మూటలేనని ఎన్నోసార్లు వెల్లడయింది

దిశ, శేరిలింగంపల్లి : చెరువుల పరిరక్షణ కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం. వాటిని అభివృద్ధి చేస్తున్నాం అంటూ అధికారులు చెబుతున్న మాటలు అన్నీ గాలి మూటలేనని ఎన్నోసార్లు వెల్లడయింది. శేరిలింగంపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న చెరువుల్లో ఇప్పటికే కొన్ని కనుమరుగవగా మరికొన్ని యథేచ్ఛగా అన్యాక్రాంతం అవుతున్నాయి. అయినా జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల సమన్వయలోపమో, లేదా అక్రమార్కులతో లోపాయికారి ఒప్పందాలో కానీ చెరువులను చెరబడుతున్న కబ్జాదారుల విషయంలో అన్ని శాఖల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. చెరువుల కబ్జాలపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పలుమార్లు అధికారులను హెచ్చరించినా.. ఆయనే స్వయంగా పరిశీలించినా అధికారుల తీరు మారలేదు. తాజాగా చెరువుల కబ్జాలపై ఎమ్మెల్యే గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు అంటే కబ్జారాయుళ్లు ఎంతలా రెచ్చిపోతున్నారో తెలిసిపోతుంది.
అన్ని శాఖలు చోద్యం చూస్తున్నాయి..
గంగారం పెద్ద చెరువు కబ్జాలకు అడ్డాగా మారిందని, కొందరు కబ్జాదారులు గంగారం పెద్ద చెరువులో 5 ఎకరాల మేర మట్టిని పోసి ఆక్రమణకు యత్నిస్తున్నారని ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ ఆరోపించారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని నాలుగు చెరువుల సుందరీకరణ లో భాగంగా బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గాంధీ చెరువుల కబ్జాలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువుల సుందరీకరణ, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, స్వచ్ఛంద సంస్థల సహకారంతో పనులు కొనసాగిస్తున్నామని గుర్తు చేశారు. అయితే కొందరు కబ్జాదారులు మాత్రం చెరువులు, కుంటలను కబ్జాలకు పాల్పడుతున్నాయని అన్నారు.
గంగారం పెద్ద చెరువులో కొందరు సెక్యూరిటీ సిబ్బంది ఉండగానే 5 ఎకరాల విస్తీర్ణంలో చెరువును కబ్జా చేశారని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో ఇరిగేషన్ సిబ్బందికే తెలియాలని అన్నారు. తాను చేస్తున్నవి కేవలం ఆరోపణలు మాత్రమే కాదని, వాస్తవాలు అని, గంగారం పెద్ద చెరువు దగ్గరకు వెళ్లి చూస్తే ఎవరికైనా కనిపిస్తాయని అన్నారు. చెరువులు, కుంటలు పెద్ద ఎత్తున కబ్జాలకు గురవుతుంటే రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, హైడ్రా శాఖలు ఎందుకు స్పందించడం లేదని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అధికారులను ప్రశ్నించారు.
నిద్రమత్తులో ఇరిగేషన్, జీహెచ్ఎంసీ..
చెరువులను పరిరక్షించాల్సిన ఇరిగేషన్ అధికారులు అందులో ఆక్రమణలు జరిగినా మిన్నకుండి చూస్తున్నారని, చెరువులో మట్టి పోసి పూడ్చేసినా మాకేం సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫలానా లే అవుట్‌లో చాలా వరకు చెరువులోనే ఉందని ఎవరైనా ప్రశ్నిస్తే మాకు సంబంధం లేదు, అప్పుడు తాము ఇక్కడ లేమంటూ దాటవేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. చెరువు శిఖం, కుంటలు, కాలువలకు సంబంధించిన ఏ విషయంపై ఇరిగేషన్ సిబ్బందిని ప్రశ్నించినా మాకు ఆ అధికారం లేదు, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, పోలీసు శాఖలు సహకరించడం లేదని దాటవేసే ధోరణిని అవలంభించడం ఇక్కడి ఇరిగేషన్ అధికారులకు సర్వసాధారణంగా మారిందనే టాక్ వినబడుతోంది. జీహెచ్ఎంసీ టీపీఎస్ అధికారులు అలాంటి వాటికి అనుమతులు జారీ చేస్తున్నట్టు తెలిసింది. ఒక్క గంగారం పెద్ద చెరువు కిందనే 64 నిర్మాణాలకు ఇల్లీగల్ అనుమతులు జారీచేశారని స్థానిక ఎమ్మెల్యే గాంధీ ఆరోపించారు. అంతేకాదు అక్కడికి వెళ్లి గతంలో పరిశీలన చేశారు.
ముందు నుంచి వంత పాడుతున్న అధికారులు..
గంగారం పెద్ద చెరువులో ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు కొత్తేమి కాదు. గంగారం పెద్ద చెరువు (లేక్ ఐడీ 3710) విస్తీర్ణం రికార్డుల ప్రకారం 111.10 ఎకరాలు ఉన్నట్లు చెబుతున్నా ఇప్పుడు దాని విస్తీర్ణం 80 ఎకరాలు కూడా ఉండదన్నది క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఇట్టే అర్థం అవుతుంది. గంగారం పెద్ద చెరువులోనే వందల సంఖ్యలో నూతన కట్టడాలు వెలిశాయి. ఇంకా నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. చాలాకాలంగా ఇవి సర్వ సాధారణంగా మారిపోయాయి. అయినా ఇరిగేషన్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు ఏనాడు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని చెప్పాలి. కబ్జాదారులు గంగారం పెద్ద చెరువును అన్ని వైపుల నుంచి చెరబడుతూనే ఉన్నారు. ఇదంతా నాణ్యానికి ఒకవైపు అయితే, ఇదే చెరువులో భూదాన్ భూములు కూడా ఉన్నాయంటూ గతంలో ఇక్కడ పనిచేసిన మండల రెవెన్యూ సర్వేయర్ నిర్దారించడం గమనార్హం.
అంతేకాదు వీటిపై ఆ భూములు ఏకంగా చెరువులోనే ఉన్నట్టు తేల్చి చెప్పారు. అంతేకాదు హద్దు రాళ్లు కూడా పెట్టి ఇవే భూదాన్ భూములు అంటూ నిర్ధారణ చేసేశారు. ఇక చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లో ఆక్రమణలు జరిగాయని ఏఈ దృష్టికి తీసుకువెళ్లిన ప్రతీసారి మాకు ఇతర శాఖల అధికారులు సహకరించడం లేదని దాటవేత ధోరణి అవలంభిస్తున్నారు. వీటిపై డీఈని ప్రశ్నించగా ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలు వాస్తవమేనని బాధితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ ఇప్పటి వరకు కబ్జాదారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గంగారం చెరువు కబ్జాలపై స్వయంగా గాంధీ స్పందించిన నేపథ్యంలో అయినా అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.
ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలి..
శేరిలింగంపల్లి మండల వ్యాప్తంగా ఉన్న చాలా చెరువులు కబ్జాలకు గురయ్యాయి. గంగారం పెద్ద చెరువులో కబ్జాలు నేటికి జరుగుతూనే ఉన్నాయి. రానున్న రోజుల్లో గంగారం పెద్ద చెరువు పూర్తిగా ఆక్రమణలకు గురైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ చెరువును ఆనుకుని ఓ రియలెస్టేట్ సంస్థ వెంచర్ వేసి చెరువు శిఖాన్ని అమ్మేసింది. అన్నీ తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదు. గంగారం పెద్ద చెరువు పరిరక్షణకు చర్యలు తీసుకోకపోతే సీపీఎం పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం.- చల్లా శోభన్, సీపీఎం నాయకుడు