నగరంలో భారీ వర్షం.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు
బంగాళఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఆల్పపీడనం కాస్త వాయుగుండంగా మారడంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
దిశ, వెబ్ డెస్క్: బంగాళఖాతంలో ఏర్పడిన ద్రోణి, అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారడంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో కూడా రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగా.. బుధవారం తెల్లవారుజామున కూడా వర్షం కురిసింది. రాత్రి నుంచి చల్లగా మారిన వాతావరణం.. ఒక్కసారిగా వర్షం రూపంలో పడటంతో నగర ప్రజలు వణికిపోతున్నారు.
బుధవారం తెల్లవారు జామునే మొదలైన వర్షం.. కుత్బుల్లాపూర్, నిజాంపేట్, బాచుపల్లి, గండిమైసమ్మ, చింతల్, షాపూర్ నగర్, మేడ్చల్ ప్రాంతంలో దాదాపు గంటసేపు దంచి కొట్టింది. దీంతో ప్రధాన రహదారులన్నీ జలమయం కావడంతో ఉదయాన్నే ఉద్యోగాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షం కారణంగా నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో రహదారులపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే మరికొద్ది సేపట్లో నగరమంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ఇప్పటికే మేఘావృతం అయిందని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ జారీ చేశారు.