గ్రేటర్ ప్రజలను భయపెడుతున్న మంచినీటి బిల్లులు..

గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను మంచినీటి బిల్లులు భయపెడుతున్నాయి .

Update: 2024-10-15 09:24 GMT

దిశ , హైదరాబాద్ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను మంచినీటి బిల్లులు భయపెడుతున్నాయి . జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతి ఇంటికి నెలకు 20 వేల లీటర్ల వరకు మంచినీటిని ఉచితంగా ఇవ్వాలని సుమారు నాలుగేండ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో గ్రేటర్ పరిధిలో నివాసముంటున్న వారు ఉచిత మంచినీటి పథకం కోసం పీటీఐఎన్, క్యాన్ నెంబర్లతో ఆధార్ అనుసంధానం చేశారు. అనంతరం నీటి బిల్లులు రాకపోవడంతో ప్రజలు సంతోషపడ్డారు. అయితే వారి సంతోషం ఎంతో కాలం నిలువలేదు. ఇటీవల కాలంలో అధికారులు నీటి బకాయిలు ఉన్నాయని, వెంటనే చెల్లించాలని నోటీసులు జారీ చేస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కొంత మందికి ఏరియర్స్ తో కలిపి వేలల్లో, మరికొంత మందికి లక్షల్లో బిల్లులు రావడంతో షాక్ అవుతున్నారు. అప్పట్లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ బీ) మార్గదర్శకాల మేరకు దరఖాస్తు చేసుకోవడం, ఇందుకు తగ్గట్లుగా బిల్లులు రాకపోవడంతో ఈ పథకానికి తాము అర్హులమని, అందుకే బిల్లులు రావడం లేదని చాలా మంది భావించారు. అయితే ఇటీవల కాలంలో ఇందుకు భిన్నంగా పలు రకాల కారణాలు చూపుతూ పాత బకాయిలు కలిపి వెంటనే బిల్లులు చెల్లించాలని, లేనిపక్షంలో నీటి కనెక్షన్ తొలగిస్తామని నోటీసులు జారీ చేయడంతో ప్రజలలో ఆందోళన మొదలైంది.

అపార్ట్ మెంట్లకు సైతం..

గత జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా గ్రేటర్ పరిధిలో నివాసముంటున్న వారికి 20 వేల లీటర్ల మంచినీటిని ఉచితంగా సరఫరా చేయనున్నట్లు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. అపార్ట్ మెంట్లకు సైతం ఉచిత నీటిని పొందడానికి ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రతి ఇంటికీ నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీటిని ఇస్తున్న మాదరిగానే అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్లకు కూడా వర్తింపజేయాలని నిర్ణయించింది. ఒక అపార్ట్‌మెంట్‌లో ఎన్ని ఇళ్లు (ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌తో) ఉంటే అన్ని కుటుంబాలకు ప్రతి నెలా 20 వేల లీటర్ల చొప్పున జలమండలి ఉచిత నీటిని అందిస్తారని ప్రకటించింది.

అపార్ట్ మెంట్లలో నివాసముండే వారు www.hyderabadwater.gov.in కు లాగిన్ అయిన అనంతరం ఆధార్‌ అనుసంధానం చేసుకున్నారు. వచ్చిన ఓటీపీ ఎంటర్‌ చేస్తేనే ఎక్స్‌ఎల్‌ షీట్‌ ఓపెన్‌ కావడంతో పాటు ఫ్లాట్‌ యజమాని పేరు, పీటీఐఎన్‌ నంబరు, అనంతరం ఆధార్‌ నెంబర్ ను నమోదు చేశారు. ఇబ్బందులు ఏర్పడితే 155313 నెంబర్ కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని ప్రకటించారు. ఇలా మార్గదర్శకాల మేరకు గ్రేటర్ పరిధిలోని సుమారు పది వేలకు పైగా అపార్ట్ మెంట్లలో నివాసముంటున్న లక్షకు పైగా ఫ్లాట్ ఓనర్స్ దరఖాస్తు చేసుకోగా వీరిలో చాలామందికి ఇప్పుడు నల్లాబిల్లులు కట్టాలని నోటీసులు వచ్చినట్లు తెలిసింది.

19వ తేదీలోగా చెల్లించాలి...

కొత్తపేటలోని ఓ అపార్ట్ మెంట్ కు జలమండలి అధికారులు అక్టోబర్ 2020 నుండి అక్టోబర్ 2024 వరకు పెండింగ్ మంచినీటి బకాయిలు చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. ఇందులో రూ 1,72,800 వాటర్ సెస్, సీవరేజ్ సెస్ రూ 60,480 , సర్వీస్ చార్జీలు రూ 7,200 మొత్తం రూ 2,40,480 లకు గాను రూ 65,130 రిబేట్ పోగా రూ1,75,349 ఈ నెల 19వ తేదీలోగా చెల్లించాలని పేర్కొన్నారు. దీంతో ఆందోళన చెందిన అపార్ట్ మెంట్ లో నివాసముంటున్న వారు వాటర్ బోర్డు అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఫెనాల్టీ, డిస్కనెక్షన్ నుండి మినహాయింపు పొందేందుకు బిల్లులో సూచించిన మేరకు గడువులోగా చెల్లించాలని హుకుం జారీ చేశారు. ఇంత స్వల్ప వ్యవధిలో ఇంత మొత్తం ఎలా చెల్లించేదని వారు ఆందోళన చెందుతున్నారు. సుమారు నాలుగేండ్ల పాటు బిల్లులు ఇవ్వకుండా ఇలా మొత్తం ఒకేసారి చెల్లించాలని బిల్లులు పంపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితే చాలా మందికి ఎదురౌతోందని, ప్రభుత్వం ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.


Similar News