పోక్సో కేసులో నిందితులకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష
నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి తాను సహజీవనం చేస్తున్న వివాహిత మహిళ మైనర్ కూతురిని బెదిరించి,
దిశ, చైతన్యపురి : నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి తాను సహజీవనం చేస్తున్న వివాహిత మహిళ మైనర్ కూతురిని బెదిరించి, బంధించి అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటనలో నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2022 లో పోక్సో కేసు నమోదైంది. ఈకేసులో నిందితులు నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునూతల మండలం వొల్లూరు గ్రామానికి చెందిన గోగు సురేష్ ( 34 ) కార్ డ్రైవర్ గా పనిచేస్తూ నాగోల్ లోని శుభం ఫంక్షన్ హాల్, నువ్వులబండలో నివాసం ఉండేవాడు.
ఇతను నాగోల్ సాయి నగర్ కాలనీలో ఉంటూ కూలి పనులు చేసుకునే పెంకుల లక్ష్మి అలియాస్ లత (34) తో సహజీవనం చేస్తున్నాడు. ఈమెకు ఒక మైనర్ బాలిక ఉండగా సురేష్ బాలికను లైంగికంగా వేధించాడు. పోక్సో కేసు నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరిపై నమోదు కాగా అత్యాచారం, పోక్సో చట్టం ప్రకారం రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి నిందితులని మంగళవారం దోషులుగా నిర్ధారించారు. ఈ కేసులో నిందితులిద్దరికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు నిందితులు A1 సురేష్ కు రూ.14 వేలు, A2 లక్ష్మి కు రూ. 11 వేలు జరిమానా విధించారు. బాధితురాలికి రూ.3 లక్షలు పరిహారం అందించబడింది. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సునీత వాదనలు వినిపించారు.