ప్రాణాలు తీస్తున్న వ్యాపారం..

ముందుగా అంతా మంచి జరుగుతుందని ఆలోచించి వ్యాపారంలోకి దిగుతారు.

Update: 2024-12-30 02:38 GMT

దిశ ప్రతినిధి, నిర్మల్ : ముందుగా అంతా మంచి జరుగుతుందని ఆలోచించి వ్యాపారంలోకి దిగుతారు. సన్నిహిత ఆత్మీయ మిత్రుడు కలిసి కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తారు. లాభాలు వస్తే సరే... ఆ వ్యాపారం నష్టాల ఊబిలోకి వెళితే..! ప్రాణప్రదంగా మెలిగిన మిత్రులు శత్రువులుగా మారిపోతారు. ఆ తర్వాత పెట్టిన పెట్టుబడులు.. వ్యాపారంలో తీసుకువచ్చిన వడ్డీలు మిత్రుల నడుమ కత్తులుగా మారుతున్నాయి. జవాబు చెప్పుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నిర్మల్ జిల్లా కేంద్రంలో వంశీకృష్ణ అనే యువ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న ఘటన వ్యాపార లావాదేవీల్లో జరుగుతున్న చిక్కుముడులకు అద్దం పడుతున్నది. ఏ వ్యాపారం చేసిన అనాలోచితంగా చేయవద్దన్న సంకేతాలకు ఈ ఘటన నిదర్శనంగా మారుతున్నది.

వంశీకృష్ణ ఆత్మహత్య ఎందుకు..?

నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన వంశీకృష్ణ అనే యువ వ్యాపారి రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రైవేటు దవాఖాన మెడికల్ నిర్వహణ రీత్యా తనకు అత్యంత సన్నిహితులైన మిత్రులతో వ్యాపారంలోకి దిగాడు. కొంత పెట్టుబడి పెట్టడంతో పాటు.. వ్యాపారంలో భాగంగా మెడికల్ ఏజెన్సీల నుంచి కొంత మేర మందులు అడ్వాన్స్ కింద తీసుకువచ్చారు. ప్రైవేటు ఆసుపత్రి బాగా నడిచినంత కాలం మిత్రుల భాగస్వామ్యంలో ఎలాంటి వివాదాలు లేవు. అయితే ప్రైవేటు దవాఖాన ఏర్పాటు విషయంలో మిత్రుల నడుమ ఏర్పడిన వివాదం ఆత్మహత్యకు దారితీసింది. వ్యాపారంలో లాభాలు వచ్చినప్పుడు ఎలాంటి వివాదం లేకపోగా.. ఆ తర్వాత జరిగిన నష్టాల విషయంలో తప్పు మీదంటే నీదంటూ... జరిగిన వివాదం 30 ఏళ్లు కూడా నిండని వంశీకృష్ణ ఆత్మహత్యకు పాల్పడడం విషాదం నింపింది.

ఇలాంటి వివాదాలు ఎన్నో...

రెండు రోజుల క్రితం మెడికల్ వ్యాపారి తన సన్నిహితుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు రాసిన సూసైడ్ లేక తీవ్ర కలకలం రేపింది. అత్యంత సన్నిహితంగా మెలిగిన మిత్రులే తన ఆత్మహత్యకు కారణం అంటూ రాసిన లేఖ వ్యాపార వర్గాల్లో దుమారం లేపుతున్నది. వ్యాపార లావాదేవీలు లాభనష్టాలు ఎలా ఉన్నా యువకుడు ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం తీవ్ర కలకలం రేపుతున్నది. వంశీకృష్ణ ఆత్మహత్యతో తనకు అత్యంత ఆత్మీయంగా మెలిగిన వ్యాపారుల ఒత్తిడితో జరిగిన వ్యవహారం నేపథ్యంలో పలువురి పై పోలీసు కేసులు నమోదు అయ్యాయి. వారంతా ఇప్పుడు పరారీలో ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇలాంటి సంఘటనలు అనేకంగా జరుగుతూనే ఉన్నాయి. వ్యాపార లావాదేవీల కారణంగా యుక్త వయస్సులోనే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటు చేసుకోవడం భవిష్యత్తు వ్యాపారవేత్తలకు ఒక గుణపాఠం గా మారుతున్నాయి. తెలిసి తెలియక వ్యాపారం చేయడం.. లాభనష్టాల కారణంగా ఆత్మహత్యలు చేసుకోవడం కారణంగా కనిపెంచిన తల్లిదండ్రులకు గర్భశోకం మిగులుస్తున్నాయి.


Similar News