ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులకు చిక్కిన పులి
గత కొద్ది రోజులుగా తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో సంచరిస్తూ జిల్లా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న పులిని ఎట్టకేలకు బుధవారం మహారాష్ట్ర, చంద్రపూర్ అటవీ అధికారులకు చిక్కింది.
దిశ, ఆసిఫాబాద్ : గత కొద్ది రోజులుగా తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో సంచరిస్తూ జిల్లా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న పులిని ఎట్టకేలకు బుధవారం మహారాష్ట్ర, చంద్రపూర్ అటవీ అధికారులకు చిక్కింది. అటవీ ప్రాంతాల్లో తిరుగుతున్న పెద్దపులి జిల్లాలోని సరిహద్దు గ్రామాల్లోని రహదారి వెంటనే తరుచూ తిరుగుతుండడంతో వేటగాళ్ల దృష్టి పడే ప్రమాదం ఉందని, దాదాపు వారం రోజుల పాటు అధికారులు శ్రమించి చాకచక్యంగా వ్యవహరించి పులిని బోనులో బంధించారు.
సిర్పూర్ టి మండలంలోని మాకిడి గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో పులిని బోనులో బంధించారు. అనంతరం వైద్య పరీక్షల కోసం చంద్రపూర్ తరలించారు. పులికి అవసరమైన వైద్యం అందించిన తర్వాత తడోబా పులుల సంరక్షణ కేంద్రంలో వదిలి పెట్టనున్నట్లు సమాచారం. కానీ జిల్లా అటవీ శాఖ అధికారులు మాత్రం దీని పై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.