వివాదాస్పదంగా ఉస్మానియా దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ తీరు

పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే మరోవైపు కొంత మంది ఉన్నతాధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది.

Update: 2024-07-05 10:09 GMT

దిశ, హైదరాబాద్ బ్యూరో : పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే మరోవైపు కొంత మంది ఉన్నతాధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. మేం చెప్పిందే వేదం, ఎవరి బాధలు మాకు పట్టవు అనేలా వ్యవహరిస్తున్నారు. అఫ్జల్ గంజ్ లో రాష్ట్రంలోనే ఎంతో పేరున్న ఉస్మానియా దంత వైద్య కళాశాల ఉంది. ఇక్కడికి గ్రేటర్ పరిధి నుండే కాకుండా జిల్లాల నుంచి కూడా ప్రతినిత్యం వందల సంఖ్యలో పేద రోగులు వస్తుంటారు. వీరికి మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ప్రిన్సిపాల్ కళాశాలలో ఉన్న వసతులు కూడా వారికి దూరం చేస్తున్నారని, చివరకు హాస్పిటల్ లో పని చేసే వైద్యులు, సిబ్బంది పట్ల కూడా ఆమె నిరంకుశంగా ఉండడంతో ఆమెపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆమెను వెంటనే విధుల నుంచి తప్పించి ఇతర ప్రిన్సిపాల్ లను నియమించాలని ఆల్ ఇండియా డెంటల్ స్టుడెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. మతిస్థిమితం కోల్పోయినట్లుగా ప్రవర్తిస్తున్న డాక్ఠర్ అరుణను వెంటనే విధుల నుంచి తప్పించాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం కూడా ఫిర్యాదు చేసింది.

ఆది నుండి వివాదాస్పదమే...?

ఉస్మానియా దంత కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పీ అరుణ పనితీరు ఆది నుండి వివాదాస్పదమే. గతంలో 2014లో విజయవాడలో ఆమె పని చేసిన సమయంలో కూడా ఆమెపై పలు ఫిర్యాదులు వచ్చాయి. అనంతరం ఆమె ఉస్మానియా డెంటల్ కాలేజ్ కు బదిలీపై వచ్చిన 2021 నుంచి కూడా పరిస్థితులలో మార్పు రాలేదు. రోగులు, వైద్యులు, సిబ్బంది పట్ల ఆమె వ్యవహరిస్తున్న తీరు, వేదింపులను భరించలేక విసుగు చెందిన కొంత మంది వైద్య విద్యార్థులు, సిబ్బంది హై కోర్టును, హెచ్ఆర్సీ, రాష్ట్ర గవర్నర్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డీఎంఈ లకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీసీఐ) వెబ్ సైట్ కు 22 మంది విద్యార్థుల వివరాలు అప్ లోడ్ చేయాల్సి ఉండగా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో డీసీఐ ఆమెపై చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శికి లేఖ రాసింది. అంతేకాకుండా కాలేజ్ లో పనిచేస్తున్న వారికి మెడికల్ లీవ్ లు శాంక్షన్ చేయకపోవడం , ఉద్దేశ్య పూర్వకంగా వేతనాలు ఆపుతున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. పరీక్షలు రాసే సమయంలో సుమారు 500 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ కేవలం ఒక్క బయోమెట్రిక్ మిషన్ మాత్రమే ఏర్పాటు చేయడంతో విద్యార్థులు పరీక్ష రాసే విలువైన సమయం కోల్పోతున్నారు.

అటెండెన్స్ ఉన్నా ...?

ఉస్మానియా డెంటల్ కాలేజ్ లో చదువుతున్న దంత వైద్య విద్యార్థుల పట్ల ఆమె కర్కశంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు. కాలేజ్ లో చదివే విద్యార్థులకు అవసరమైన అటెండెన్స్ ఉన్నా వారికి అటెండెన్స్ తక్కువగా ఉందని పరీక్షలకు అనుమతించకపోవడంతో కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్న వైద్య విద్యార్థిని న్యాయస్థానం నుంచి అనుమతి తెచ్చుకుని పరీక్షలకు హాజరయ్యారు. బీడీఎస్ రెండవ సంవత్సరం చదువుతున్న మరో 22 మంది విద్యార్థినులను కక్షపూరిత ధోరణిలో అటెండెన్స్ ఉన్నా లేదని డిటెండ్ చేయడం వివాదాస్పదమైంది. దీంతో వారు డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారుల అనుమతితో పరీక్షలు రాశారు. 50 సంవత్సరాల వయస్సు ఉన్న ఓ మహిళా నాన్ టీచింగ్ ఉద్యోగిని తొలగించడంతో పాటు మరో నలుగురిని అకారణంగా సస్పెండ్ చేశారు. దీనికితోడు వైద్య విద్యార్థులు, వైద్యులు,టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది తమకు ఎదురవుతున్న ఇబ్బందులు ఆమెతో చెప్పుకుందామన్నా సమయం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని వారు ఆరోపిస్తున్నారు.

సంవత్సర కాలంగా లిఫ్ట్ బంద్...

ఉస్మానియా దంత కళాశాలలో పై అంతస్థులకు వెళ్లేందుకు ఉన్న లిఫ్ట్ లను సుమారు సంవత్సర కాలంగా మూసి ఉంచారు. అవి పని చేస్తూ కండీషన్ లో ఉన్నప్పటికీ లిఫ్ట్ పని చేయడం లేదని నోటీస్ ఒకటి గోడకు అంటించారు. దీంతో వైద్య చికిత్సలకు వచ్చే వికలాంగ రోగులు మెట్లపై పాకుతూ అనేక ఇబ్బందుల మధ్య పై అంతస్థులకు వెళ్తున్నారు. అంతేకాకుండా కాలేజ్ లో చదివే విద్యార్థులు నాల్గవ అంతస్థులో పరీక్ష రాయాల్సి ఉంటుంది. హాస్పిటల్స్ , కాలేజ్ ల మెయింటెనెన్స్ లకు ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్నప్పటికీ ఖర్చు తగ్గించాలనే కారణంతో ఏడాది కాలంగా లిఫ్ట్ ను మూసి ఉంచినట్లు ఆమె అధికారులకు సమాధానం ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది . లిఫ్ట్ మూసి ఉంచడం తో పైకి చేరేందుకు వికలాంగ విద్యార్థులు సైతం పడరాని పాట్లు పడుతున్నారు. అనునిత్యం ఇలా అందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రిన్సిపాల్ డాక్టర్ పీ అరుణపై చర్యలు తీసుకోవాలని, ఆమెను విధుల నుంచి తప్పించి ఇతర ప్రిన్సిపాల్ ను నియమించాలని కాలేజ్ లో చదివే దంత వైద్య విద్యార్థులతో పాటు అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.


Similar News