దొడ్డి కొమురయ్య మనందరికీ ఆదర్శం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు, తెలంగాణ హక్కుల సాధనకు విశేష కృషి చేసిన దొడ్డి కొమురయ్య మనందరికీ ఆదర్శం అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
దిశ, రవీంద్రభారతి: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు, తెలంగాణ హక్కుల సాధనకు విశేష కృషి చేసిన దొడ్డి కొమురయ్య మనందరికీ ఆదర్శం అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం దొడ్డి కొమురయ్య 78 వ వర్ధంతి సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో కార్యక్రమం నిర్వహించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యలు హాజరై దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరులో తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య త్యాగం చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. నియంతృత్వ పాలన నుంచి విముక్తికి సాగిన సాయుధ పోరాటం నుంచి స్ఫూర్తిని పొంది వారి ఆశయమైన ప్రజా పాలన సాగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, ఎమ్మెల్సీ వొగ్గే మల్లేష్, క్యామ మల్లేష్, కరాటే ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.