అక్రమంగా ఏ ఇంటినీ కూల్చం

కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఇంటిని అక్రమంగా కూల్చదని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ అన్నారు.

Update: 2024-10-01 15:44 GMT

దిశ, చైతన్య పురి : కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఇంటిని అక్రమంగా కూల్చదని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ అన్నారు. కాంగ్రెస్ అంటేనే పేదలకు ఇళ్లు ఇచ్చేదని పేర్కొన్నారు. మూసీ సుందరీకరణలో భాగంగా సమీపకాలనీలలోని ఇళ్లు కూలగొడతారని, మార్కింగులు ఇచ్చారని ప్రజలు గందరగోళానికి గురవుతున్న నేపథ్యంలో మంగళవారం కొత్తపేట , చైతన్యపురి డివిజన్లలో ఆయన పర్యటించారు. మూసీ సమీప ఇళ్ల నివాసులతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పి భరోసా కల్పించారు. తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అప్పులు చేసి ఇళ్లు కొన్నామని మహిళలు కన్నీరు పెట్టి మధుయాష్కీగౌడ్ కు తమ గోడు వెలిబుచ్చారు. దాంతో ఆయన స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి అధిష్టానం ఉందని, ఒకవేళ అన్యాయంగా ప్రజల ఇళ్లు కూలగొడితే అధిష్టానం కూడా జోక్యం చేసుకుంటుందని పేర్కొన్నారు.

     తాను కూడా అధిష్టానం దృష్టికి తీసుకుపోయే స్థాయిలో ఉన్నానని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా తన స్వార్థం కోసం మూసీ సుందరీకరణ చేపట్టడం లేదన్నారు. మూసీలో ప్రవహించే మురుగునీరు వల్ల ప్రజలు రోగాల బారిన పడకుండా ఐదు టీఎంసీల గోదావరి నీటిని ప్రవహించేలా చేయాలనే సంకల్పంతో ఉన్నట్టు తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం ఇళ్లు కూల్చాలంటే యూపీఏ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్ విలువకు నాలుగింతల నష్టపరిహారం చెల్లించాల్సిందేనని పేర్కొన్నారు.

     మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించి సుందరీకరణ కూడా చేయవచ్చని పేర్కొన్నారు. నదికి ఇళ్లు ఉన్న వైపు కాకుండా పొలాలు ఉన్న వైపు ఎక్కువ స్థలాన్ని సేకరించి సుందరీకరణ చేయవచ్చని సూచించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, నాయకులు మూసీ పరీవాహక ప్రాంతంతో పాటు చెరువులు, కుంటలను కబ్జా చేసి అక్రమంగా సంపాదించారన్నారు. వారే నేడు ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని, ప్రజల వద్దకు వచ్చి నీతి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన వెంట ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ పాల్గొన్నారు. 

Tags:    

Similar News