మూసీ వెంట మొదలైన కూల్చివేతలు
మూసీ సుందరీకరణలో భాగంగా మంగళవారం కూల్చివేతలు మొదలయ్యాయి.
దిశ, హైదరాబాద్ బ్యూరో : మూసీ సుందరీకరణలో భాగంగా మంగళవారం కూల్చివేతలు మొదలయ్యాయి. నగరంలో 55 కిలోమీటర్ల మేర మూసీకి ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించాలని ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. దీనిని నిరసిస్తూ గత కొన్ని రోజులుగా మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్ ప్రాంతాలలో నివాసముంటున్న వారు ఆందోళనలు మొదలు పెట్టారు. దీంతో ప్రభుత్వం పునరాలోచనలో పడిందని, ఇప్పట్లో కూల్చివేతలు ఉండవనే ప్రచారం సాగింది.
అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మూసీ రివర్ బెడ్ వెంట ఉంటున్న వారికి డబుల్ బెడ్ రూంలు కేటాయించడం ద్వారా వారికి పునరావాసం కల్పించి కూల్చివేతలు ప్రారంభించారు. ఇందులో భాగంగా మలక్ పేట్ శంకర్ నగర్, చాదర్ ఘాట్, మూసానగర్, రసూల్ పురా, వినాయక్ నగర్ ప్రాంతాలలో మూసీ రివర్ బెడ్ ను అనుసరించి కూల్చివేతలు చేపట్టారు.
స్వచ్ఛందంగా ఖాళీ చేసిన వారి నివాసాలు కూల్చివేత....
మలక్ పేట్ శంకర్ నగర్ ప్రాంతంలోని రివర్ బెడ్ ను అనుసరించి నివాసముంటున్న వారిని ఖాళీ చేయించడంలో అధికారులు సఫలమయ్యారు. ఈ ప్రాంతంలో నివాసముంటున్న వారికి నచ్చచెప్పి ఇళ్లను ఖాళీ చేయించారు. వీరికి సైదాబాద్ ప్రాంతంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించారు. బాధిత కుటుంబాలు సామాగ్రితో తరలివెళ్లేందుకు అధికారులు రవాణా సౌకర్యం ఏర్పాటు చేశారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు మొదలు పెట్టగా ఆయా ప్రాంతాలలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
163 కుటుంబాలు తరలింపు.....
మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమకు ఉండడానికి వసతి సౌకర్యం కోసం డబుల్ బెడ్ ఇండ్లు మంజూరు చేయాలని కోరినందున వారికి 163 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేసినట్టు అధికారులు తెలిపారు.