ఏపీకే ఫైల్స్‌పై సైబర్ సెక్యూరిటీ పోలీసుల అలర్ట్..
PM-KISAN, PM-YOJANA యాప్స్ పేరుతో ఏపికే ఫైల్స్
దిశ, సిటీ క్రైమ్ : PM-KISAN, PM-YOJANA యాప్స్ పేరుతో ఏపికే ఫైల్స్(ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్) రూపంలో సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. ఏపీకే రూపంలో ఈ యాప్స్ ను పంపుతు వాటిని డౌన్ లోడ్ చేసుకోమని కోరుతున్నారు. అలా ఒక సారి ఏపీకే ఫైల్ ని డౌన్ లోడ్ చేసుకోగానే అందులో ఉండే మాల్ వేర్(వైరస్) మీ ఫోన్ ను హ్యాక్ చేసి మొత్తం సమాచారాన్ని సైబర్ దొంగల చేతిలో పెడుతుంది. అలా వచ్చిన సమాచారంతో సైబర్ మోసగాళ్లు మీ ఖాతాలను మొత్తం ఊడ్చేయడంతో పాటు మీ వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, విడియోలను అడ్డంపెట్టుకుని బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడి లక్షలు డిమాండ్ చేసే అవకాశం ఉంటుందని సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఏపీకే ఫైల్ ను గుర్తిస్తే మీరు ఇలా చేయండి..
*మీకు ఏదైనా అనుమానాస్పద యాప్ అని తెలియగానే వెంటనే దానిని అన్ ఇన్ స్టాల్ చేయండి.
*హ్యాక్ అయినట్టు అనుమానం వస్తే వెంటనే అన్నింటి పాస్ వార్డులను మార్చండి.
*1930 కు ఫోన్ చేయండి లేదా CYBERCRIME.GOV.IN ఫిర్యాదు చేయాలి.
జాగ్రత్తలు ఇలా..
*గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఏపీకే ఫైల్స్ ను అసలు క్లిక్ చెయ్యొద్దు.
*గూగుల్ ప్లే లేదా ఇతర నమ్మకమైన వెబ్ సైట్ ల నుంచే డౌన్ లోడ్ చేసుకోండి.
*యాప్ అసలు దో లేదా నకిలీదో గుర్తించిన తర్వాత వాటికి అనుమతులను ఇవ్వండి.
*మీ ఫోన్ డివైజ్ సెక్యూరిటీ , ఆపరేటింగ్ సిస్టమ్ పాసువార్డులను తరచు మార్చుకుంటుండాలి.
*మీరు గోల్డెన్ అవర్ లో ఫిర్యాదు చేస్తే నష్టాన్ని తగ్గించడంతో పాటు మోసం నుంచి వేగంగా బయటపడే అవకాశం ఉంటుంది.