దిశ ప్రతినిధి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండండి, మీ ఖాతా వివరాలు ఎవరికీ చెప్పొద్దు అంటూ ఖాతాదారులను అప్రమత్తం చేసే బ్యాంకులను సైతం సైబర్ నేరగాళ్లు వదలడం లేదు. ఆంధ్రప్రదేశ్ మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేసి ఏకంగా రూ.12 కోట్లు కొల్లగొట్టారు. ఈ సంఘటనతో బ్యాంక్ పాలకవర్గం ఒక్కసారిగా షాక్ అయింది. వెంటనే సైబర్ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేసి మరింత నష్టం జరుగకుండా దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. మహేష్ బ్యాంక్‌కు తెలంగాణలో 38 శాఖలు, ఏపీలో మూడు శాఖలు, రాజస్థాన్‌లో రెండు శాఖలు మొత్తం 43 శాఖలు ఉన్నాయి. వీటిల్లో 35 బ్రాంచ్‌లు హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ఉండగా, సాలీనా బ్యాంక్‌లో రూ.4,400 కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా, ఇటీవల బ్యాంక్ మెయిన్ సర్వర్‌ను హ్యాక్ చేసిన సైబర్ కేటుగాళ్లు రూ.12 కోట్లను మొత్తం 120 ఖాతాలను దారిమళ్లించారు. నెలవారి ఆడిట్‌లో భాగంగా జరిగిన దీనిని గుర్తించిన బ్యాంక్ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ మేరకు సోమవారం సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. దీనిపై బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ.. ఖాతాదారుల అకౌంట్లు సురక్షితంగా ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని సూచించారు. త్వరలోనే నిందితులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారని పేర్కొన్నారు.