Cyber Crime: చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లు.. ముంబై పోలీస్ పేరుతో దోపిడి

హలో.. మీ పేరుపై పార్సిల్ వచ్చింది.

Update: 2024-11-21 02:36 GMT

దిశ, పేట్ బషీరాబాద్ : హలో.. మీ పేరుపై పార్సిల్ వచ్చింది. అందులో అభ్యంతరకరమైన వస్తువులు ఉన్నాయి. మీ కాల్‌ను పోలీసులకు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాము మాట్లాడండి అంటూ సైబర్ నేరగాళ్లు ఫేక్ కాల్స్ చేసి ఇంటరాగేషన్ పేరుతో భయభ్రాంతులను గురిచేసి అందినకాడికి దోచుకుంటున్నారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల పేరిట వస్తున్న ఈ తరహా ఫోన్ కాల్స్ ఉచ్చులో పడి బాధితులు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ముంబై క్రైమ్ బ్రాంచ్‌ పోలీసులమని మాట్లాడుతూ మీపై పలు కేసులు నమోదయ్యాయి, మా పైఅధికారులతో మాట్లాడండి అంటూ స్కైప్ లేదా వీడియో కాల్‌లో మాట్లాడుతూ ఇంటరాగేషన్ పేరుతో అవతలి వ్యక్తులను భయభ్రాంతులకు గురిచేసి వారి అకౌంటును వెరిఫికేషన్ చేయాలని లింకు ద్వారానో యూపీఐ ద్వారాను డబ్బులను దోచుకుంటున్నారు.

విద్యావంతులే మోసపోతున్నారు..

ఈ తరహా సైబర్ నేరాలలో ఎక్కువగా ఉన్నత విద్యావంతులే మోసపోతున్నారు. వీరిలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అయితే మరి కొందరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఉన్నారు. కొన్ని సందర్భాలలోనే సామాన్యులు లేదా గృహినులు ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో జరిగిన ఘటనలు పరిశీలిస్తే ఫారెస్ట్ విభాగంలో సెక్షన్ ఆఫీసర్, చార్టెడ్ అకౌంటెంట్, ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఉన్నతస్థాయి ఉద్యోగులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులోపడిన వారిలో ఉన్నారు. ముంబై పోలీస్ సైబర్ నేరగాళ్లు అన్ని సందర్భాలలో ఒకేలా వ్యవహరించడం లేదు. ఒక సందర్భంలో పార్సిల్ వచ్చిందని, మరొక సందర్భంలో మీ పిల్లవాడు డ్రగ్స్ కేసులో ఉన్నాడని, మరొక సందర్భంలో విదేశాలలో మీ పిల్లవాడు రేప్ కేసులో ఇరుక్కున్నాడని ఫోన్ చేయడం పరిపాటిగా మారింది.

వీడియో కాల్ ఇంటరాగేషన్ నమ్మొద్దు.. గడ్డం మల్లేశ్, జీడిమెట్ల సీఐ

ముంబై పోలీసులు అంటూ ఎవరైనా ఫోన్ చేస్తే ఏమాత్రం స్పందించకండి. పోలీసులు వీడియో కాల్‌లో ఇంటరాగేషన్ చేయడం జరగదు. ఎవరు ముంబై పోలీసులు అంటూ ఫోన్ చేసి ఇంటరాగేషన్ పేరిట వీడియో కాల్ చేస్తే పట్టించుకోవద్దు. అనుమానాలు ఉంటే స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోండి.

Tags:    

Similar News