Constructions : ఎఫ్టీఎల్, బఫర్ లలోనే నిర్మాణాలు.. చోద్యం చూస్తున్న అధికారులు..
చెరువుల పరిరక్షణ కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం.
దిశ, శేరిలింగంపల్లి : చెరువుల పరిరక్షణ కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం. వాటిని అభివృద్ధి చేస్తున్నాం అంటూ అధికారులు చెబుతున్న మాటలు అన్నీ గాలి మూటలుగా మిగిలిపోతున్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న చెరువుల్లో ఇప్పటికే కొన్ని కనుమరుగు అవగా మరికొన్ని యథేచ్ఛగా అన్యాక్రాంతం అవుతున్నాయి. అయినా జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల సమన్వయలోపమో, లేదా అక్రమార్కులతో లోపాయికారి ఒప్పందాలో కానీ చెరువులను చెరబడుతున్న కబ్జాదారుల విషయంలో అన్ని శాఖల అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు అనేందుకు అనేక ఉదాహరణలు కళ్లముందే కనిపిస్తున్నాయి. అయినా అన్ని శాఖల అధికారులు మాత్రం మాకేం సంబంధం లేదంటే మాకేం సంబంధం లేదంటూ ఒకరి పై ఒకరు తోసేసుకుంటున్నారు. వీరి సమన్వయ లోపాన్ని ఆసరాగా చేసుకుని కబ్జాల పరంపర కొనసాగుతోంది. చెరువు శిఖాలు అంతకంతకు తగ్గిపోతున్నాయి.
చెరువు శిఖాల్లో రియల్ దందా..
నగరంలో ఆక్రమణదారులు చెరువులు, కుంటలను మింగేస్తున్నారు. క్రమంగా జలవనరులు అదృశ్యం అవుతున్నాయి. ఒకప్పుడు నగర ప్రజల దాహార్తి తీర్చిన చెరువులు ఇప్పుడు క్రమంగా తమ ఉనికి కోల్పోతున్నాయి. మరికొన్ని మురుగునీటితో మునిగిపోతున్నాయి. చెరువు శిఖాల్లో రియలెస్టేట్ వ్యాపారులు వెంచర్లు వేసి దర్జాగా అమ్మేస్తున్నారు. వారికి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సైతం నిర్మొహమాటంగా నిరభ్యంతర పత్రాలు జారీచేసేస్తున్నారు. చెరువులు, ప్రభుత్వ భూముల పక్కనే స్థలాలు కొంటున్న రియల్ వ్యాపారులు ఎంచక్కా చెరువు కుంటలను అన్యాక్రాంతం చేసి వందల కోట్ల వ్యాపారాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఒక్క శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనే పదుల సంఖ్యలో కాలనీలు, వేల సంఖ్యలో నివాసాలు వెలిశాయి. గతంలోనే చెరువుల అన్యాక్రాంతం పై అధికారులు నివేదికలు తయారు చేసినా అవి కాగితాలకే పరిమితం అయ్యాయి. కానీ కబ్జాల్లో ఉన్న అక్రమార్కులను మాత్రం కదిలించలేక పోయారు.
అంబీరు చెరువు చెర వీడేనా..!
కూకట్ పల్లి మండలం బాగ్ అమీర్ అంబీర్ చెరువు పూర్తి విస్తీర్ణం 156 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇదే విషయాన్ని 6.08.2013లో సర్వే నిర్వహించిన ఇరిగేషన్ అధికారులు అధికారికంగా ధృవీకరించారు. అలాగే 162 ఎకరాల మేర నీటితో కవర్ చేయబడి ఉందని తెలిపారు. అనంతరం 27.01.2014లో మరోసారి సర్వే నిర్వహించారు. అంబీర్ చెరువుకు 4812 లేక్ ఐడీ కేటాయించి దీని రక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు రికార్డుల్లో పొందుపరిచారు.
అలంకార ప్రాయంగా వాచ్ టవర్లు..
చెరువులను కాపాడేందుకు, కబ్జాలను అరికట్టేందుకుగాను లక్షలాది రూపాయలు వెచ్చించి జీహెచ్ఎంసీ అధికారులు చెరువుల వద్ద వాచ్ టవర్లు నిర్మించారు. నెల నెల వేల రూపాయలు చెల్లించి షిఫ్ట్ ల వారిగా వాచ్ మెన్లను ఏర్పాటు చేశారు. కానీ అవి అలంకార ప్రాయంగా దర్శనమిస్తున్నాయి. చాలాచోట్ల పూర్తిస్థాయిలో వాచ్ మెన్లను ఏర్పాటు చేయక పోవడంతో వాచ్ టవర్లు పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. ఇంకొన్నిచోట్ల వాచ్ మెన్ల సాక్షిగా చెరువు స్థలాల్లో కబ్జాలు కొనసాగుతున్నాయి. అయినా అటు రెవెన్యూ అధికారులు, ఇటు జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
అంబీర్ చెరువు చుట్టూ నిర్మాణాలు..
సరైన అనుమతులు లేకుండా అంబీర్ చెరువు సమీపంలో గత కొంతకాలంగా ఓ నిర్మాణం కొనసాగుతుంది. ఇది బఫర్ జోన్ లో ఉందంటూ గతంలో అధికారులు పాక్షికంగా కూల్చివేతలు చేపట్టారు. కానీ నిర్మాణదారుడు మాత్రం ఎక్కడా తగ్గేదే లేదంటూ మళ్లీ అక్కడే నిర్మాణం చేపట్టి దాన్ని పూర్తి చేసేందుకు వేగంగా పనులు కొనసాగిస్తున్నాడు. అప్పుడు బఫర్ జోన్ లో ఉందంటూ కూల్చివేత్తలు చేపట్టిన అధికారులకు ఇప్పుడెందుకు కనిపించడంలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. అటు నగర వ్యాప్తంగా హైడ్రా హడలెత్తిస్తున్నా.. ఎందుకో వారికి కూడా బఫర్ జోన్ లో ఉన్న కట్టడం ఎందుకు కనబడడంలేదన్నది ఎవరికి అంతు చిక్కడం లేదు. ఇలాంటి నిర్మాణాల పై రెవెన్యూ, ఇరిగేషన్, హైడ్రా అధికారులు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు సర్వత్రా వినిపిస్తున్నాయి.
అధికారుల నిర్లక్ష్యంతోనే కబ్జాలు.. బాలస్వామి.. సోల్ స్వచ్ఛంద సంస్థ కన్వీనర్
నగర వ్యాప్తంగా ఉన్నా చాలా చెరువులు కబ్జాలకు గురయ్యాయి. ప్రతి చెరువు గత విస్తీర్ణంతో పోలిస్తే ప్రస్తుతం కుంచించుకుపోయింది. అభివృద్ధి పేరున అధికారులే చెరువులకు కొత్త హద్దులు నిర్ణయించారు. దీంతో కబ్జారాయుళ్లకు అధికారికంగా వత్తాసు పలికినట్లు అయింది. ఉన్న కాస్త చెరువులనైనా కాపాడాల్సిన అవసరం ఉంది. లేదంటే చెరువులు అనేవి చరిత్రలో చెప్పుకోడానికే పరిమితం అవుతాయి. అంబీర్ చెరువు అక్రమంగా సాగుతున్న నిర్మాణాలను తొలగించాలి. దీనిపై హైడ్రా అధికారులు స్పందించాలి.