Hyderabad : కాంగ్రెస్ బీసీల సంఖ్యను తక్కుగా చూపిస్తోంది : తలసాని
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivasa Yadav) మరోసారి విరుచుకు పడ్డారు.

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivasa Yadav) మరోసారి విరుచుకు పడ్డారు. బుధవారం తెలంగాణ భవన్ లో GHMC పరిధిలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, BRS పార్టీకి చెందిన GHMC కార్పొరేటర్ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్పొరేటర్ లు ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నగర అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని విమర్శించారు. అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రజలకు అండగా నిలబడి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పై వత్తిడి తీసుకురావాలని అన్నారు.
ఈ నెల 17 వ తేదీన మరోసారి నిర్వహించే సమావేశంలో GHMC స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో పోటీ చేసే విషయంపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. త్వరలోనే కేసీఆర్(KCR) కార్పొరేటర్లతో సమావేశం కానున్నారని పేర్కొన్నారు. కులగణనపై తలసాని స్పందిస్తూ.. ప్రభుత్వం చెప్పిన లెక్కల కంటే బీసీల జనాభా ఎక్కువ ఉందన్నారు. రాష్ట్రంలో 57 శాతం కంటే ఎక్కువ మంది బీసీలు ఉంటే ప్రభుత్వం మాత్రం బీసీల సంఖ్యను తక్కువ చూపిందన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం బడ్జెట్, సీట్ల కేటాయింపుల్లో బీసీలకు తీవ్రంగా నష్టం జరుగుతుందని అన్నారు. ఈ విషయంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో మాజీమంత్రి హోంమంత్రి మహమూద్ అలీ, MLC సురభి వాణి దేవి, MLA లు ముఠా గోపాల్, మర్రి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.