పచ్చదనం పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు.. 12 ప్రాంతాలకు గ్రీన్ సిగ్నల్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవంలో 20.02 కోట్ల మొక్కలను నాటే లక్ష్యాన్ని పెట్టుకోగా, ఇప్పటివరకు 16.84 కోట్ల (84%) మొక్కలు నాటామని మంత్రి సురేఖ తెలిపారు. ..

Update: 2024-12-04 16:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవంలో 20.02 కోట్ల మొక్కలను నాటే లక్ష్యాన్ని పెట్టుకోగా, ఇప్పటివరకు 16.84 కోట్ల (84%) మొక్కలు నాటామని మంత్రి సురేఖ తెలిపారు. తెలంగాణ అటవీశాఖ సాధించిన వార్షిక పురోగతి నివేదికను బుధవారం బొటానికల్ గార్డెన్స్‌లో విడుదల చేశారు. తెలంగాణ హరితనిధి కింద మంజూరైన రూ. 40.67 కోట్లతో 12 ప్రాజెక్టులు చేపట్టామన్నారు. కేంద్ర ప్రభుత్వం 'నగర్ వన యోజన పథకం' ద్వారా తెలంగాణ రాష్ట్రానికి 14 నగర వనాలను కేటాయించి, వీటి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.18.90 కోట్ల నిధులతో నగరాల్లో పచ్చదనం పెంపొందించే దిశగా కార్యాచరణను అమలు చేస్తున్నామన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్ మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ ఛేంజ్ 100 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్న గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ ద్వారా 1,738 హెక్టార్ల అటవీ భూమి రిజిస్టర్ చేశామన్నారు. రాష్ట్రంలో ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో ఎకో టూరిజం పాలసీని తెస్తున్నట్లు ప్రకటించారు.

రాష్ట్రంలోని 12 ప్రముఖ ప్రాంతాలను ఎకో టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేయడం జరుగుతున్నదన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌ అర్బన్ ఫారెస్ట్ పార్కు, హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కుల్లో ఎకో-టూరిజం ప్రాజెక్టులను పీపీటీ విధానంలో చేపట్టామన్నారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ జోన్ కోర్ ఏరియా నుంచి నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మైసంపేట్, రాంపూర్ గూడేలను తొలి విడతగా ఖాళీ చేయించడంతో పాటు, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా నుంచి నాలుగు గ్రామాల తరలింపు పనులను వేగవంతం చేశామన్నారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్‌ను మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్‌తో కలిపే 1442.26 చదరపు కి.మీల అటవీ ప్రాంతాన్ని కన్జర్వేషన్ రిజర్వ్‌గా ప్రకటించేందుకు అటవీశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి స్పష్టం చేశారు.

వన్యప్రాణుల దాడులతో మృతి చెందితేవారి కుటుంబాలకు రూ10 లక్షల నష్టపరిహారం ఇస్తున్నామన్నారు. వన్యప్రాణుల వేట, జంతువుల అక్రమ వ్యాపారాన్ని నివారించడానికి “క్యాచ్ ది ట్రాప్” పేరుతో తెలంగాణ అటవీశాఖ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నదన్నారు. కాంట్రాక్టర్లతో తునికాకు కూలీలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి, అటవీశాఖ నేరుగా వారి అకౌంట్ లో డబ్బులు జమ చేస్తున్నదన్నారు. ‘ఆన్ లైన్ బీఎల్ కలెక్షన్ స్కీమ్’ ను ప్రవేశపెట్టి అక్రమాలను నివారించగలిగిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2024 లో 113 తునికాకు సేకరణ యూనిట్ల పరిధిలో 82,627 మంది తునికాకు సేకరణ కార్మికులు నమోదు చేసుకోగా, వీరికి ప్రభుత్వం 29.40 కోట్ల రూపాయలను ఆన్ లైన్‌‌లోనే చెల్లించిందన్నారు. రాష్ట్రంలోని తునికాకు సేకరణ కార్మికులకు నికర తునికాకు సేకరణ ఆదాయంగా రూ. 158.49 కోట్లు పంపిణీ చేయడం జరిగిందని స్పష్టం చేశారు. నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ (ఎన్టీపీఎస్) ద్వారా అటవీ అనుమతులను ఆన్లైన్‌‌లో ఇస్తూ దాదాపు 22,954 అనుమతులు ఆన్‌లైన్‌లో జారీ చేసి పారదర్శకతకు పెద్దపీట వేసిందన్నారు. ఆక్రమణకు గురైన 17,643.30 ఎకరాల అటవీ భూమిని స్వాధీనం చేసుకుని అటవీభూముల పట్ల అటవీశాఖకున్న నిబద్ధతను నిరూపించుకున్నదని కొండా సురేఖ స్పష్టం చేశారు. 


Similar News