వృథా కావొద్దు.. రిజర్వాయర్లకు తరలించండి: వర్షపు నీరుపై అధికారులకు సీఎం ఆదేశం

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటిని వృథా కానివ్వకుండా వీలైన అన్ని చోట్లా నింపాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు....

Update: 2024-09-01 14:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే పలు రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, చెరువుల్లోకి నీరు పుష్కలంగా చేరినా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటిని వృథా కానివ్వకుండా వీలైన అన్ని చోట్లా నింపాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడేలా పంప్ హౌజ్‌ల ద్వారా ఎగువకు లిఫ్టు చేసి నిల్వ చేయాలన్నారు. ఇరిగేషన్ మంత్రి, అధికారులతో ఆదివారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం రేవంత్... రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు మరో రెండు రోజుల పాటు అదే వాతావరణం కొనసాగనున్నందన్న హెచ్చరికలతో అన్ని జిల్లాల్లోని ప్రాజెక్టుల తాజా స్టేటస్‌ను అడిగి తెలుసుకున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా, నీటిని సద్వినియోగం చేసుకోడానికి ఉన్న అవకాశాలపైనా దిశానిర్దేశం చేశారు. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకుండా వీలైనంత ఎక్కువగా నీటిని స్టోర్ చేయాలని స్పష్టం చేశారు.

అన్ని ప్రాజెక్టుల పరిధిలోని రిజర్వాయర్లు, చెరువులు కుంటల్లో నీటిని నిల్వ చేయాలని, దీనికి అనుగుణంగా విద్యుత్ సరఫరాను నిరంతరాయంగా అందిస్తూ పంప్ హౌజ్‌లను ఫంక్షన్ చేయించాలన్నారు. ఎగువన కురిసిన వర్షాలతో పాటు కడెం నుంచి వస్తున్న వరదతో పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండిందని, గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి వదులుతున్నా విషయాన్ని తెలుసుకుని కొన్ని జాగ్రత్తలు సూచించారు. ఎల్లంపల్లికి వచ్చిన వరద నీటిని వీలైనంత మేరకు లిఫ్ట్ చేయాలని, రోజుకు ఒక టీఎంసీ సామర్థ్యానికి తగ్గకుండా డ్రా చేయాలని ఆదేశించారు. నంది, గాయత్రి పంప్ హౌజ్‌ల ద్వారా నీటిని లిఫ్ట్ చేసి రిజర్వాయర్లను నింపాలన్నారు. మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్‌లతో పాటు రంగనాయక్‌ సాగర్‌, మల్లన్న సాగర్ వరకు జలాశయాల్లోకి ఏకధాటిగా నీటిని లిఫ్ట్ చేయాలని ఆదేశించారు.

ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి సామర్ధ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.45 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు ముఖ్యమంత్రికి ఇరిగేషన్ అధికారులు వివరించారు. కడెం ప్రాజెక్టు నుంచి ప్రవాహం ఉధృతంగా వస్తుండటంతో నంది, గాయత్రి పంప్ హౌజ్‌ల ద్వారా మిడ్ మానేరుకు నీటిని తరలిస్తున్నట్లు వివరించారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు పూర్తి సామర్ధ్యం 27 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15 టీఎంసీలు ఉన్నట్లు తెలిపారు. అక్కడి నుంచి 14 వేల క్యూసెక్కులకు పైగా లోయర్ మానేరు డ్యామ్‌కు, మరో 6,400 క్యూసెక్కులు అన్నపూర్ణ రిజర్వాయర్ ద్వారా రంగనాయక్‌ సాగర్‌కు తరలిస్తున్నారు అధికారులు. అటు రంగనాయక సాగర్ నుంచి నీటిని పంపింగ్ చేసి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నింపాలని, అక్కడి నుంచి సింగూర్ ప్రాజెక్ట్, నిజాంసాగర్ ప్రాజెక్ట్ వరకు తరలించాలని ఆదేశించారు.

ప్రస్తుతం అన్నపూర్ణ, రంగనాయక సాగర్‌లో 7.52 టీఎంసీ, మల్లన్నసాగర్‌లో 50 టీఎంసీల పూర్తి కెపాసిటీ అయితే ప్రస్తుతం రెండుచోట్లా కలిపి 11.43 టీఎంసీల నిల్వ ఉన్నది. కొండపోచమ్మ సాగర్‌లో 15 టీఎంసీల కెపాసిటీ ఉండగా 7.91 టీఎంసీ నీళ్లున్నాయని అధికారులు వివరించారు. కేంద్ర జల సంఘం మార్గదర్శకాల ప్రకారం మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లలో సాధ్యమైనంత వరకు నీటిని నిల్వ చేయాలని సీఎం స్పష్టం చేశారు. మల్లన్నసాగర్‌లో గరిష్ఠంగా 18 నుంచి 20 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్‌లో 10 టీఎంసీల చొప్పున నిల్వ చేయాలని ఆదేశించారు. అన్ని ముందు జాగ్రత్తలనూ పాటించాలని అధికారులను అప్రమత్తం చేశారు. కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీ వాగు ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలించాలని చెప్పారు.


Similar News