మంత్రి మల్లారెడ్డిని మళ్లీ ఆశీర్వదించండి.. మేడ్చల్ సభలో సీఎం కేసీఆర్ కీలక హామీలు
ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్ శంఖారావాన్ని ప్రారంభించారు. ..
దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్ శంఖారావాన్ని ప్రారంభించారు. వరుస సభలు నిర్వహిస్తున్నారు. కొన్నిగంటల క్రితం జడ్చర్లలో పర్యటించిన ఆయన తాజాగా మేడ్చల్ నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రజలను బాసిసల్లా చూశారని సీఎం కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్ చేసిన తప్పిదాల వల్లే తెలంగాణలో కరెంట్ లేని పరిస్థితులు ప్రజలు ఎదుర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని నెంబర్‌గా నిలిపామని చెప్పారు. పర్ కేపిటల్ ఆదాయంలో దేశానికి రాష్ట్రం తలమానికంగా ఉందన్నారు. పేదలందరినీ ఆదుకుంటున్నామని హామీ ఇచ్చారు. రైతులు, పట్టణ పేదలకు అండగా నిలిచామని తెలిపారు. ఒక్క రూపాయి తీసుకోకుండా పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చామని తెలిపారు. పదేళ్లలో చాలా అభివృద్ధిని చేసి చూపించామన్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని చాలా మంది వస్తారని.. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆపద మొక్కులు మొక్కే వాళ్లు వస్తారని, కానీ బీఆర్ఎస్‌కు అండగా నిలబడాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకుని మంచి నీళ్ల బాధ పొగొట్టుకున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్ నియోజకవర్గం ఒక మినీ భారత దేశమని ఆయన చెప్పారు. ఈ నాలుగు నియోజకవర్గాలకు భారతదేశంలోని చాలా మంది పేదలు వలస వచ్చి బతుకుతున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఈ నాలుగు నియోజకవర్గాలకు ప్రత్యేక బడ్జెట్ పెడతామని హామీ ఇచ్చారు. ఇప్పటికే 99 శాతం హామీలు నెరవేర్చామని, తెల్లరేషన్ కార్డు వారందరికీ బీమా వర్తింపజేస్తామని చెప్పారు. తెలంగాణలో మూడు కోట్ల టన్నుల వడ్లు పండుతున్నాయని, రేషన్ కార్డు హోల్డర్లకు అన్నపూర్ణ స్కీం కింద సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. పింఛన్‌ను ప్రతి ఏడాది పెంచుకుంటూ పోతామని, అలా ఐదో సంవత్సరం వచ్చే సరికి రూ.5 వేలు అందిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మరో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తామన్నారు. మంత్రి మల్లారెడ్డిని మళ్లీ ఆశీర్వదించాలని సీఎం కేసీఆర్ కోరారు.