10 నెలలు దాటినా రాని స్పష్టత.. కీలక నిర్ణయాలు పెండింగ్?

వర్సిటీల్లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లేకపోవడంతో చాలా పనులు పెండింగ్‌లో పడుతున్నాయి. కౌన్సిల్ బాడీ లేకపోవడం అభివృద్ధికీ అడ్డంకిగా మారింది.

Update: 2024-12-29 02:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వర్సిటీల్లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లేకపోవడంతో చాలా పనులు పెండింగ్‌లో పడుతున్నాయి. కౌన్సిల్ బాడీ లేకపోవడం అభివృద్ధికీ అడ్డంకిగా మారింది. పలు నిర్ణయాల్లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ బాడీ కీలకం. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో సభ్యుల పదవీకాలం ముగిసింది. ఆపై నూతన కౌన్సిల్ ఏర్పాటు అంశంలో ఎలాంటి ముందడుగు పడలేదు. దాదాపు 10 నెలలు దాటినా ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఆలస్యమవుతున్నది. ఇప్పటికే నూతన వీసీల నియామకం పూర్తయినా.. వర్సిటీల్లో అభివృద్ధి చేద్దామంటే ‘ఈసీ’ లేక ఇబ్బందిగా మారినట్లు తెలుస్తున్నది.

కాకతీయ మినహా..

తెలంగాణ విద్యాశాఖ పరిధిలో మొత్తం 12 వర్సిటీలు ఉన్నాయి. వాటిలో కాకతీయ యూనివర్సిటీ మినహా దాదాపు ఇతర వర్సిటీల్లో ఎందులోనూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ప్యానల్ ను నియమించలేదని తెలుస్తున్నది. వర్సిటీల్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కౌన్సిల్ పాత్ర కీలకం. అయినా ప్యానల్ నియామకంపై అధికారులు ఏమాత్రం దృష్టిసారించడంలేదనే విమర్శలు వస్తున్నాయి. యూనివర్సిటీల యాక్ట్ ప్రకారం ఈసీ పదవీకాలం మూడేండ్లుగా ఉంది. అయితే 2023లోనే మూడేండ్ల కాలపరిమితి ముగిసింది. గత ప్రభుత్వం ఏడాది గడువు పొడిగించింది. ఆ గడువు ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసింది. అప్పటి నుంచి ఈసీ ప్యానల్ లేక యూనివర్సిటీల్లో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ పెండింగ్ పడినట్లు సమాచారం.

రూ. 10 లక్షలకు మించి..

విశ్వవిద్యాలయాల్లో వైస్ చాన్స్ లర్లకు రూ.10 లక్షలకు మించి ఖర్చు చేయడానికి వీల్లేదనే నిబంధనలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతకంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేయాలంటే ఈసీ ప్యానల్ అనుమతి తప్పనిసరి ఉండాలని చెబుతున్నారు. రూ. 10 లక్షలకు మించి ఏదైనా పని చేయాలంటే ప్రతి నిర్ణయానికి ఈసీల ఆమోదం తప్పనిసరి అనే నిబంధన ఉందని సమాచారం. ఈసీ ప్యానల్ లేకపోవడంతో భవనాల నిర్మాణ పనులు, ఇతర రిపేర్లు, పెండింగ్ పనులు చేపట్టలేకపోతున్నట్లు తెలసింది. ఆర్థిక సమస్యలతోపాటు లీగల్ అంశాలు, విజిలెన్స్ కేసులపైనా ఎలాంటి ముందడుగు పడడం లేదని సమాచారం. తెలంగాణలోని పలు వర్సిటీలకు రెండు నెలల క్రితమే కొత్త వీసీలు వచ్చారు. అయినా ఈసీ ప్యానల్ ను ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ ను నియమించాలనే డిమాండ్లు వస్తున్నాయి.

Tags:    

Similar News