ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు…
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
దిశ, ఖైరతాబాద్ : హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. విధులకు ఆటంకం కలిగించడంతోపాటు బెదిరింపులకు గురిచేశారంటూ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డి సహా అతని అనుచరులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం మధ్యాహ్నం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నవారిని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే, అదే సమయంలో బయటకు వెళ్తున్న సీఐ ని గమనించి తన ఫిర్యాదు స్వీకరించిన తర్వాతే వెళ్లాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే, అర్జెంట్ పని ఉందని బయటకు వెళ్తున్నా. తిరిగి వచ్చిన తర్వాత తీసుకుంటానని సీఐ చెప్పడంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు సీఐ వాహనాన్ని అడ్డుకుని నినాదాలు చేశారు. దీంతో సీఐ వెనక్కి వచ్చి ఫిర్యాదు పత్రం తీసుకున్నారు. అంతకుముందు సీఐపై కౌశికర్ రెడ్డి పలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మీ విషయం తేలుస్తామంటూ హెచ్చరించారు. తమను చూసి కూడా ఫిర్యాదు తీసుకోకుండా పారిపోతున్నారంటూ కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలకు ఎలాంటి ప్రోటోకాల్ ఇవ్వాలో తెలుసుకోవాలని.. అసెంబ్లీ రూల్ బుక్ చదువుకో సీఐకి అని చెప్పారు. నాలుగేళ్ల తర్వాత తమ ప్రభుత్వం వస్తుందని.. అప్పుడు చెప్తామంటూ సీఐతో కొంతసేపు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.