ఉస్మానియా వెలుగులో తెలంగాణ విద్యార్థి ఉద్యమం పుస్తకావిష్కరణ…

తెలంగాణ విద్యార్థి ఉద్యమం ప్రపంచం గర్వించదగినదని ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే. శ్రీనివాస్ అన్నారు. విద్యార్థుల త్యాగం లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదని ఆయన పేర్కొన్నారు.

Update: 2024-06-08 11:03 GMT

దిశ, సికింద్రాబాద్: తెలంగాణ విద్యార్థి ఉద్యమం ప్రపంచం గర్వించదగినదని ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే. శ్రీనివాస్ అన్నారు. విద్యార్థుల త్యాగం లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదని ఆయన పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో నలమాస కృష్ణ రచించిన "ఉస్మానియా వెలుగులో తెలంగాణ విద్యార్థి ఉద్యమం" పుస్తకావిష్కరణ సభను శనివారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించారు. మాందాల భాస్కర్ అధ్యక్షత వహించిన ఈ సభకు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తకాన్ని చూడగానే తెలంగాణ ఉద్యమ రచన మొదలైందనే సంతోషం కలుగుతుందన్నారు. స్వాతంత్య్రం అనంతరం చాలా చరిత్ర రికార్డు అయిందని, అన్ని రాష్ట్రాల్లో ఆ దిశగా ప్రయత్నాలు జరిగాయన్నారు.

ప్రత్యేక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం చరిత్ర రాసుకునే ప్రయత్నాలు చేయలేదన్నారు. ఉద్యమాన్ని, త్యాగాలను అప్రధానం చేసి, ఉద్యమం అంతా ఒకరి బుర్రలో పుట్టిన ఆలోచన అనే అభిప్రాయాన్ని పదేళ్లపాటు ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చారని పేర్కొన్నారు. సమాజంలో చరిత్ర రచన అనేది ముఖ్యమైన విషయమన్నారు. తెలంగాణ విద్యార్థి ఉద్యమాన్ని సంఘటనగా కాకుండా ఆ విద్యార్థి ఉద్యమ క్రమాన్ని రచయిత కృష్ణ పుస్తకంలో పొందుపరచాడని తెలిపారు. అనంతరం ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ పదేళ్ల తెలంగాణను సమీక్షించుకుంటున్న కాలంలో ఈ పుస్తకం ఒక అవసరం అన్నారు. విద్యార్థి ఉద్యమం మీద ఇప్పటివరకు ఒక నిర్మాణాత్మక రచన లేదని, ఆ ఖాళీని ఈ పుస్తకం పూరిస్తుందన్నారు. కార్యక్రమంలో డేవిడ్, అరుణాంక్ లత, ప్రొఫెసర్ వెంకటేష్ నాయక్, ప్రొఫెసర్ గాలి వినోద్ ,ప్రొఫెసర్ నానుమాస స్వామి, దుర్గం భాస్కర్, కోట శ్రీనివాస్, దరువు ఎల్లన్న, స్టాలిన్, కంచర్ల బద్రి, నెల్లిసత్య, మోహన్ ధరావత్ తదితరులు పాల్గొన్నారు.


Similar News