పెంపుడు కుక్కకు ఏబీసీ-ఏఆర్ మస్టు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజురోజుకు పెరుగుతున్న కుక్క కాట్లు, కుక్కల దాడులు నివారించే దిశగా జీహెచ్ఎంసీ మరో సరికొత్త నిబంధనను తెరపైకి తేనుంది.
దిశ, సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజురోజుకు పెరుగుతున్న కుక్క కాట్లు, కుక్కల దాడులు నివారించే దిశగా జీహెచ్ఎంసీ మరో సరికొత్త నిబంధనను తెరపైకి తేనుంది. మహానగరంలో ఎక్కడ భవన నిర్మాణం జరిగినా, అక్కడ కనీసం యాభై మంది కూలీలు పని చేస్తే, ఆ కూలీల పిల్లలను చూసుకునేందుకు తప్పకుండా క్రష్ ఏర్పాటు చేయాలని నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధమైంది. కొద్ది రోజుల క్రితం జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భవన నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో కూలీ పడుకోబెట్టిన చిన్నారిపై కుక్కలు దాడి చేసి, తీవ్రంగా గాయపడటంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన తెలిసిందే. దీంతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో వీటి నివారణ కోసం పరిష్కార మార్గాన్ని అన్వేషించిన జీహెచ్ఎంసీ మెటర్నరీ బెనిఫిట్ యాక్ట్ 2017 ను తెరపైకి తేనుంది. ఈ చట్టంలో సవరించిన నిబంధనల ప్రకారం కనీసం 50 మంది కూలీలు పనిచేస్తున్న భవనానికి సమీపంలోనే వారి పిల్లలను చూసుకునేందుకు, వారి పిల్లల భద్రత నిమిత్తం క్రష్ కంపల్సరీ గా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ క్రష్‌ను భవనాన్ని నిర్మిస్తున్న కాంట్రాక్టరే ఏర్పాటు చేసి, దాని నిర్వహణ బాధ్యతలను కూడా నిర్వర్తించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక, భవన నిర్మాణ అనుమతులు జారీ చేసే జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ హెడ్ చీఫ్ సిటీ ప్లానర్‌కు కూడా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న నిర్మాణదారులు, కాంట్రాక్టర్లు ఈ ఆదేశాలను తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించినట్లు తెలిసింది. దీనికి తోడు హెచ్ఎండీఏ పరిధిలో కూడా ఈ క్రష్ నిబంధన అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు అవసరమైన ఆదేశాలను జారీ చేయాలని కోరుతూ బల్దియా కమిషనర్ హెచ్ఎండీఏ కమిషనర్ సర్ప్‌రాజ్‌కు లేఖలు రాసినట్లు సమాచారం. అంతేగాక, హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న స్థానిక సంస్థలకు కూడా తగిన ఆదేశాలు జారీ చేయాలని కమిషనర్ తన లేఖలో కోరినట్లు సమాచారం.
ఏర్పాటు చేయకుంటే..
క్రష్ ఏర్పాటు చేయాలనే ఆదేశాలు క్షేత్ర స్థాయిలో అమలు చేయకుండా ఉల్లంఘించే కాంట్రాక్టర్లుకు భారీగా జరిమానాలు విధించడంతో పాటు క్రష్ ఏర్పాటు చేయని కారణంగా కుక్కల దాడిలో ఎవరైనా కూలీకి చెందిన చిన్నారి మృతి చెందితే ఏకంగా నిర్మాణ అనుమతి రద్దు చేయాలని కూడా జీహెచ్ఎంసీ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నిబంధన అమలు తీరుపై త్వరలోనే జీహెచ్ఎంసీ వెటర్నరీ ఆఫీసర్ల బృందాలు తనిఖీలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
ఏబీసీ-ఏఆర్ తప్పనిసరి..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కుక్కలను పెంచుకునే వారు తప్పకుండా తమ పెంపుడు జంతువుకు యానిమల్ బర్త్ కంట్రోల్ కోసం స్టెరిలైజేషన్ ఆపరేషన్ చేయడంతో పాటు యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ చేయించాలన్న నిబంధనను త్వరలోనే మరింత కఠినంగా అమలు చేసేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీనికి తోడు వీధి కుక్కలకు ప్రస్తుతం జీహెచ్ఎంసీయే ఏబీసీ ఆపరేషన్, ఏఆర్ వ్యాక్సినేషన్ చేస్తున్న సంగతి తెలిసిందే. కుక్కలను పెంచుకునే వారు తమ పెట్ డాగ్ వివరాలను జీహెచ్ఎంసీలో నమోదు చేయించాలని, ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపాలని ఇప్పటికే ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందుకు సంబంధించి డాగ్ ఫీడర్ రిజిస్ట్రేషన్‌కు ప్రత్యేక లింక్‌ను కూడా అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం.