పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకు సీట్లు కేటాయించాలి : ఆర్.కృష్ణయ్య

త్వరలో జరిగే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని

Update: 2024-11-06 10:16 GMT

దిశ, హిమాయత్ నగర్ : త్వరలో జరిగే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకు సీట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. పట్టభద్రుల నియోజకవర్గాలు నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గాలు నల్గొండ, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు సీట్లు కేటాయించాలన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు తగినన్ని సీట్లు ఇవ్వకుండా అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేశాయని, ఇప్పుడైనా బీసీలకు ఎమ్మెల్సీ సీట్లు కేటాయించి న్యాయం చేయాలన్నారు. బీసీలు కూడా ఆర్థికంగా బలంగా ఉన్నారు.

బీసీ ఉపాధ్యాయులు, విద్యార్థుల నుండి ఒత్తిడి వస్తుంది. ప్రజాస్వామ్యంలో అన్ని కులాలకు జనాభా ప్రాతిపదికన అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. బీసీలు ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్నారు తప్ప సీట్లు ఇవ్వడం లేదు. బీసీలకు ఎవరు సీట్లు ఇస్తే వారినే బీసీ పట్టభద్రులు, ఉపాధ్యాయులు గెలిపించుకుంటారని తెలిపారు. బీసీలకు సీట్లు ఇవ్వని పార్టీలను బొంద పెడతాం అని హెచ్చరించారు. పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి , ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న అన్ని రాజకీయ పార్టీలు బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో భూపేష్ సాగర్, గొరిగె మల్లేష్, సి. రాజేందర్, వేముల రామకృష్ణ, సి. రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Similar News