షాప్ ప్రారంభోత్సవానికి స్నేహితురాలే నటిని పిలిచి.. వ్యభిచారం చేయాలని ఒత్తిడి
స్నేహితురాలైన ముంబై కి చెందిన సీరియల్ నటికి ఫోన్ చేసి షాప్ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించి వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేసిన సంఘటన మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది

దిశ,కార్వాన్ : స్నేహితురాలైన ముంబై కి చెందిన సీరియల్ నటికి ఫోన్ చేసి షాప్ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించి వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేసిన సంఘటన మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ పరుశురాం కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి చెందిన ఓ యువతి గత నాలుగు సంవత్సరాలుగా ముంబైలో ఉంటూ సీరియల్ నటిగా పని చేస్తుంది. కాగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన గాయత్రి, హైదరాబాదులోని ఓ బట్టల షాపును ప్రారంభించడానికి ఓ సినీ నటిని పంపించండి అంటూ ముంబైలోని మిత్రుడు పంకజ్ నీ కోరింది. కాగా అతడు ఆ నటిని షాప్ ఓపెనింగ్ కోసం ఈ నెల 18వ తేదీన హైదరాబాద్ కు పంపించాడు. అయితే గాయత్రి తో పాటు తన మిత్రురాలైన మరో మహిళతో కలిసి మాసబ్ ట్యాంక్ లోని ఓ అపార్ట్మెంట్ లో బస చేసేందుకు ఏర్పాటు చేశారు. అయితే 21 న రాత్రి 9 గంటల ప్రాంతంలో గాయత్రి తో పాటు తన మిత్రురాలైన ఇద్దరు కలిసి సినీనటి రూమ్ కు వచ్చి ముగ్గురు వ్యక్తులతో వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశారు.
ఈ క్రమంలో రాత్రి 11 గంటల ప్రాంతంలో ముగ్గురు పురుషులు నటి ఉన్న గదిలోకి ప్రవేశించి తమతో గడపాలని ఒత్తిడి చేశారు. నటి నిరాకరించడంతో ఆమె పై దాడి చేశారు. దీంతో ఆమె గట్టిగా అరిచి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పగానే వారు అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఇద్దరు మహిళలు నటిని గదిలో బంధించి, కొంత నగదుతో అక్కడి నుంచి పరారయ్యారు. సినీనటి వెంటనే 100కు ఫోన్ చేయడంతో వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని బందీగా ఉన్న నటీని విడిపించారు. అయితే ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రెండు పోలీస్ టీంలతో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా సీరియల్ నటి ముంబాయికి ముందు దుబాయ్ లో కూడా రెండు సంవత్సరాలు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.