నక్సలిజం పేరు మీద జరిగే మారణహోమం నుంచి యువతను కాపాడాలి
అడవుల్లో ఉండే నక్సలైట్లు తమ పంతం మార్చుకొని అర్బన్ నక్సలైట్ల పేరు మీద మేధావుల ముసుగులో తిష్ట వేశారని పలువురు వక్తలు పేర్కొన్నారు.
దిశ, సికింద్రాబాద్: అడవుల్లో ఉండే నక్సలైట్లు తమ పంతం మార్చుకొని అర్బన్ నక్సలైట్ల పేరు మీద మేధావుల ముసుగులో తిష్ట వేశారని పలువురు వక్తలు పేర్కొన్నారు. నక్సలిజాన్ని రూపుమాపి, నక్సలిజం పేరు మీద జరిగే మరణ హోమం నుంచి యువతను కాపాడాలని పిలుపునిచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆడిటోరియంలో మార్టైర్స్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎంఎంఆర్ఐ) ఆధ్వర్యంలో శనివారం చేంజింగ్ కలర్స్ ఆఫ్ నక్సలిజం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు అతిథులుగా లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ, మాజీ డిజిపి అరవింద్ రావు, మాజీ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు, సామాజీక సమరసత అఖిల భారత సంయోజక్ శ్యాంప్రసాద్, నెహ్రూ యువ కేంద్ర మాజీ ఉపాధ్యక్షులు పేరాల శేఖర్ రావు, ఎంఎంఆర్ఐ అధ్యక్షులు పుట్టి మురళి మనోహర్, కార్యదర్శి రంజిత్ మోహన్ తదితరులు హాజరై మాట్లాడారు. ఎంఎంఆర్ఐ 1991 డిసెంబర్ నెలలో స్థాపించబడిందని, ఈ సంస్థ నక్సల్స్ బాధితులు , అమరవీరుల గురించి రీసెర్చ్ చేస్తుందని చెప్పారు.
ఐక్యత,శాంతి లేకుండా స్వేచ్ఛ సాధ్యం కాదన్నారు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మమ్మల్ని మనమే పాలించుకుంటూ రాజ్యాంగాన్ని రూపొందించుకున్నామని గుర్తు చేశారు. అటువంటి రాజ్యాంగం ద్వారా ఏర్పడిన ప్రభుత్వాలను కూలదోసి తుపాకి రాజ్యాన్ని స్థాపిస్తాం అనడం మూర్ఖత్వం అని అన్నారు. నక్సలైట్లను, పోలీసులను గుర్తుపెట్టుకుంటున్నాం కానీ వారి మధ్యలో నలిగిపోయిన గిరిజనులను గుర్తించలేకపోతున్నామని అవేదన వ్యక్తం చేశారు. నక్సలైట్లు ఇన్ ఫార్మర్ల నెపంతో చాలామంది గిరిజనులను అంతం చేశారని పేర్కొన్నారు. ప్రజలను చైతన్యం చేయాలనుకునే చాలామంది అధికారులను నక్సలైట్లు అంతం చేశారని చెప్పారు. ఇప్పటికీ యూనివర్సిటీల్లో ఎక్కువ భాగం ప్రొఫెసర్లు వామపక్ష భావజాలం చెందినవారు ఉన్నారన్నారు. నక్సలిజాన్ని అంతమొందించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నక్సలిజాన్ని రూపుమాపి మన దేశ యువతను , సైనిక బలగాలను, పౌరులను నక్సలిజం పేరు మీద జరిపే మారణహోమం నుంచి కాపాడుకుందామని పిలుపునిచ్చారు.