50 గజాలలో 5 అంతస్తుల గాలి మేడ…
విచ్చలవిడిగా అనుమతులు లేని నిర్మాణాలు.. 60 గజాల స్థలాల్లో 6 అంతస్థుల బిల్డింగ్ లు..
దిశ, శేరిలింగంపల్లి : విచ్చలవిడిగా అనుమతులు లేని నిర్మాణాలు.. 60 గజాల స్థలాల్లో 6 అంతస్థుల బిల్డింగ్ లు.. ఒకరి గోడకు అనుకుని ఇంకో నిర్మాణం.. ఎక్కడా నిబంధనలు అనే మాటే లేదు.. కనీసం పక్క వారికి ఇబ్బంది అవుతుంది అన్న ధ్యాస లేదు. ఎవరికి వారుగా గాలి మేడలు కట్టేస్తున్నారు. తాజాగా శేరిలింగంపల్లి సర్కిల్ 20 లో 50 గజాల స్థలంలో కట్టిన 5 అంతస్థుల గాలి మేడ పక్కకు ఒరిగిన ఘటన అందులో నివసిస్తున్న వారినే కాదు చుట్టుపక్కల వారిని కూడా తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఈ ఒక్క ఘటన శేరిలింగంపల్లి జోనల్ పరిధిలో అనుమతులు లేకుండా.. ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా విచ్చలవిడిగా వెలుస్తున్న నిర్మాణాలు పరిస్థితి ఏంటి అనేందుకు అద్దం పడుతున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
సిద్దిక్ నగర్ లో ఓ వైపుకు ఒరిగిన నిర్మాణం
శేరిలింగంపల్లి సర్కిల్ 20 పరిధిలోని గచ్చిబౌలి డివిజన్ సిద్దిక్ నగర్ లో శ్రీనివాస్ అనే వ్యక్తి 50 గజాల స్థలంలో 5 అంతస్థుల ఇళ్లు నిర్మించాడు. ఆ ఇంటికి ముందు పక్క మినహా ఎక్కడా కనీసం కిటికీ కూడా లేదు. వెంటిలేషన్ అనేది కూడా లేకుండా నిర్మాణం చేపట్టాడు. ఐదు అంతస్తుల్లో మొత్తం 10 గదులు ఉండగా వాటన్నిటిని కిరాయిలకు ఇచ్చి తాను మాత్రం మరోచోట నివాసం ఉంటున్నాడు. అందులో చాలా వరకు ఒడిశా రాష్ట్రానికి చెందిన వారు నివాసం ఉంటున్నారు. ఈ భవనం పక్కనే సుమారు 150 గజాల స్థలంలో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి నిర్మాణం చేపట్టేందుకు పుటింగ్ లు తీశాడు. దీంతో దాని పక్కనే ఉన్న 50 గజాల బిల్డింగ్ ఓ వైపుకు ఒరిగింది. దీంతో మంగళవారం రాత్రి నుండి స్థానికుల్లో భయాందోళన నెలకొంది. ఎక్కడ ఆ భవనం కూలుతుందో, ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని భయాందోళనకు గురయ్యారు. 50 గజాల బిల్డింగ్ 3వ ఫ్లోర్ లో ఉంటున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన సాదిక్ హుస్సేన్ (26) పై నుంచి దూకడంతో అతని కాలు, చేతుతో పాటు వెన్నుపూసకు దెబ్బ తగిలి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పాతదానికే కాదు కొత్త నిర్మాణానికి సైతం అనుమతులు లేవు
50 గజాల స్థలంలో 5 అంతస్తులు పైన ఓ రేకుల షెడ్ వేసుకున్నప్పటికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ పక్కనే 150 గజాల స్థలంలో నిర్మాణం కోసం పుటింగ్ లు తీసిన వ్యక్తి సైతం కనీసం జీహెచ్ఎంసీలో ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదని తెలుస్తుంది. ఇలాంటి నిర్మాణాలు సిద్దిక్ నగర్ ఏరియాలో వందల సంఖ్యలో ఉన్నాయి. చాలా నిర్మాణాలకు కనీస అనుమతులు లేవని తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా టీపీఎస్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారులు అమ్యామ్యాలకు అలవాటు పడి అక్రమ నిర్మాణాలను చూసీచూడనట్టు వదిలేస్తున్నారని, కొందరు ఛోటామోటా నాయకులు కూడా అందినకాడికి దండుకుని అన్నీ తాము చూసుకుంటామని అక్రమ నిర్మాణదారులకు వంతపాడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పక్కకు ఒరిగిన భవనం కూల్చివేత
సిద్దిక్ నగర్ కాలనీలో ఉన్న భవనం పక్కనే కొత్తగా ఇంటి నిర్మాణం కోసం సెల్లార్ తవ్వగా పక్కకు ఒరిగిన భవనాన్ని అధికారులు కూల్చివేత చేపట్టారు. హైడ్రా ఉపయోగిస్తున్న హైడ్రాలిక్ మిషన్ ను తీసుకువచ్చి ఓ వైపు నుండి కూల్చివేత్తలు చేపట్టారు. అయితే మిషన్ డీజిల్ పైపు పగలడంతో కూల్చివేత్తలు మధ్యలో ఆగిపోయాయి.
ఊర్ల పొలం అమ్ముకుని వచ్చి కట్టుకున్నాం; బాధితురాలు స్వప్న
గ్రామంలో ఉన్న కాస్త పొలాన్ని అమ్ముకుని ఇళ్లు కట్టుకున్నాం. మా ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సెల్లార్ తవ్వారని, కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని సిద్దిక్ నగర్ లో పక్కకు ఒరిగిన బిల్డింగ్ యజమాని స్వప్న ఆవేదన వ్యక్తం చేశారు. మా ఇంటి బేస్మెంట్ కు ఆనుకుని లక్ష్మీనారాయణ అనే వ్యక్తి పెద్ద ఎత్తున గుంత తవ్వి పుట్టింగ్ వేయడంతో మా ఇళ్లు పక్కకు ఒరిగిపోయింది. ఎప్పుడు కూలుతుందోనన్న భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో బయటకు వచ్చాము. ఆ ఇంటి నిర్మాణం కోసం ఊర్ల ఉన్న పొలం కూడా అమ్మేశాము. ఇప్పుడు మాకు ఉన్న ఆదెరువు కూడా లేకుండా పోయింది. మేము ఉండనీకి నీడ లేదు. మేము రోడ్డున పడ్డాము. మాకు నష్టపరిహారం చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలి. లేదంటే మాకు ఆత్మహత్యనే శరణ్యం అని బాధితురాలు స్వప్న కన్నీటి పర్యంతం అయింది.
ఒక్కోరిది ఒక్కో బాధ..
ఒడిశా రాష్ట్రానికి చెందిన పరిమల్ దాస్ బ్రతుకుదెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చి భార్యా పిల్లలతో కలిసి ప్రస్తుతం పక్కకు ఒరిగిన భవనంలో ఉంటున్నాడు. మంగళవారం రాత్రి బిల్డింగ్ పక్కకు ఒరగడంతో భార్య పిల్లలతో కలిసి ప్రాణభయంతో బయటకు పరుగులు తీశాడు. ప్రస్తుతం వారు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. సామాగ్రి, బట్టలు కూడా రూములోనే ఉన్నాయని మాకు తినడానికి తిండి కూడా లేదని కన్నీరు పెట్టుకున్నారు. వీరే కాదు మరో తొమ్మిది గదుల్లో ఉన్న వారి పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
అధికారుల ఎంజాయ్..
ఓవైపు ప్రాణాలు చేతులో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ భయాందోళనకు గురవుతుంటే జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం ఇవేమీ పట్టనట్టు పక్కనే ఉన్న మరో భవనంలో కూర్చుని గేట్లు వేసుకుని టీలు తాగుతూ, టిఫిన్లు చేస్తూ ఫోన్లు చూసుకుంటూ కూర్చొవడం పట్ల పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీపీ శ్రీనివాస్ ఘటనా స్థలానికి వచ్చి పక్కకు ఒరిగిన నిర్మాణాన్ని, పుటింగ్ లు తవ్విన స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. ఇన్నాళ్లు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా మిన్నకుండి చూసిన జీహెచ్ఎంసీ అధికారులు ఘటనా స్థలంలో హాడావుడి చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి.