N కన్వెన్షన్ లో 2 ఎకరాలు ఆక్రమించారు.. హైడ్రా కమిషనర్ క్లారిటీ

Update: 2024-08-24 13:09 GMT

దిశ, శేరిలింగంపల్లిః సినీ హీరో నాగార్జునకు సంబంధించిన N కన్వెన్షన్ కూల్చివేత ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. దీనిపై ఇప్పటికే నాగార్జున హైకోర్టును ఆశ్రయించగా.. దానిపై స్టే కూడా విధించింది కోర్టు. అయితే ఈ కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. N కన్వెన్షన్ విషయంలో తాము కూల్చేవేసే సమయానికి కోర్టు నుంచి ఎలాంటి స్టే ఉత్తర్వులు లేవని ఆయన తెలిపారు. N – కన్వెన్షన్ ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లలో నిర్మించిన అనధికార నిర్మాణాల ద్వారా సిస్టమ్స్, ప్రాసెస్‌ను వారి వ్యాపారాల కోసం తారుమారు చేశారంటూ ఆయన వివరించారు. N- కన్వెన్షన్ ఎఫ్టీఎల్ లో 1 ఎకరా 12 గుంటల్లోనే ఉందని.. కానీ అదనంగా మరో 2 ఎకరాలను ఆక్రమించిందని ఆయన స్పష్టం చేశారు. అలాగే బఫర్ జోన్‌ లో మరో 18 గుంటల్లో అనధికార నిర్మాణాలను చేపట్టారని హైడ్రా అధికారులు వెల్లడించారు. N-కన్వెన్షన్‌కు జీహెచ్ఎంసీ ఎలాంటి భవన నిర్మాణ అనుమతి ఇవ్వలేదని, N కన్వెన్షన్ బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (బీఆర్ ఎస్) కింద అనధికార నిర్మాణాలను క్రమబద్ధీకరించడానికి కన్వెన్షన్ ప్రయత్నిస్తే.. సంబంధిత అధికారులు తిరస్కరించినట్టు హైడ్రా అధికారులు తెలిపారు.

తమ్మిడికుంట చెరువుకు చుట్టుపక్కల ఉన్న మాదాపూర్‌, హైటెక్స్‌ పరిసర ప్రాంతాలను అనుసంధానించే నాలాల ఆక్రమణలకు అడ్డుకట్ట వేయకపోవడంతో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంటుందని.. దాంతో తమ్మిడికుంట చెరువులో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతున్నట్టు వారు వివరించారు. దీంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తమ్మిడికుంట చెరువు దిగువ ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయన్నారు. అప్పుడు 50 - 60శాతం దిగువ, మధ్యతరగతి ప్రజల ఇళ్ళు ఈ దిగువ ప్రాంతాల్లో మునిగిపోతాయని హైడ్రా అధికారులు గుర్తు చేశారు. ఫలితంగా వారికి తీవ్ర ఆస్తి నష్టం జరుగుతోందన్నారు. N–కన్వెన్షన్ ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మించారని దానికి ఎలాంటి అనుమతి లేదన్నారు. పూర్తి ప్రాసెస్ ను ఫాలో అయిన తర్వాతనే నీటిపారుదల, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ మొదలైన శాఖల అధికారులతో కలిసి హైడ్రా అధికారులు నిర్మాణాన్ని పూర్తిగా కూల్చివేశామన్నారు.


Similar News