PCC Chief: డీలిమిటేషన్ పై నెక్స్ట్ మీటింగ్ వేదిక హైదరాాబాద్.. బీజేపీకి కనువిప్పు కలిగేలా భారీ బహిరంగ సభ: మహేశ్ కుమార్ గౌడ్
డీలిమిటేషన్ అంశంలో బీజేపీకి కనువిప్పు కలిగేలా భారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: డీలిమిటేషన్ పై హైదరాబాద్ లో దక్షిణాది రాష్ట్రాల రెండో సమావేశం నిర్వహించబోతున్నట్లు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud) వెల్లడించారు. ఇవాళ చెన్నైలో ఆ రాష్ట్ర అధికార పార్టీ డీఎంకే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం అనంతరం (Chennai All Party Meeting) పీసీసీ చీఫ్ మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీకి కనువిప్పు కలిగేలా వచ్చే నెలలో భారీ బహిరంగ సభను హైదరాబాద్ లో నిర్వహించబోతున్నామని వెల్లడించారు. ఇవాళ మీటింగ్ కు హాజరైన వారికి సీఎం రేవంత్ రెడ్డి (PCC Chief Mahesh Kumar Goud) హైదరాబాద్ మీటింగ్ కు ఆహ్వానించారని వారంతా సుముఖత వ్యక్తం చేశారన్నారు. ఈ మీటింగ్ కు తమిళనాడు, కేరళ, పంజాబ్, సీఎంలు ఎం.కే స్టాలిన్, పినరయి విజయన్, భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ అందరూ వస్తారన్నారు. ఈ సభకు సంబంధించి త్వరలోనే తేదీని ప్రకటిస్తామన్నారు. కాగా డీలిమిటేషన్ పై జేఏసీ రెండో సమావేశం రెండు రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల నేతలు భేటీ కావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి రోజు నేతల భేటీ రెండో రోజు భారీ బహిరంగ సభ నిర్వహించేలా ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రానికి నష్టం అస్సలు అంగీకరించం:
కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం గత పాలకుల చేతిలో విధ్వంసానికి గురైందని మహేశ్ గౌడ్ విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగు పరుచుకుంటూ ముందుకు వెళ్తున్న తరుణంలో డీలిమిటేషన్ వల్ల రాష్ట్రానికి జరగబోయే నష్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మేమంతా కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. తెలంగాణకు ఏ రకమైన అన్యాయం జరిగినా ఊరుకునేది లేదన్నారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని జనాభా నియంత్రణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సక్సెస్ ఫుల్ గా ఆచరించడం మూలంగా ఇప్పుడు సౌత్ స్టేట్స్ కు శాపంగా మారే అవకాశం ఉందన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయడానికి వీల్లేదన్నారు. అవసరం అయితే దీన్ని సీజ్ చేయాలి లేదా ఇప్పుడున్న మా వాటా ప్రకారం సీట్లు ఇవ్వాలని ఈ మీటింగ్ లో డిమాండ్ చేశామన్నారు.