మెడిసిన్ ఉత్పత్తి, ఎగుమతిలో ప్రపంచానికే హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌: డిప్యూటీ CM భట్టి

ఫార్మా రంగంలో అనేక ఆవిష్కరణలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని, రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగంతో స్నేహపూర్వక వైఖరిని

Update: 2024-07-05 17:23 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఫార్మా రంగంలో అనేక ఆవిష్కరణలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని, రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగంతో స్నేహపూర్వక వైఖరిని అవలంబిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో ఏ పరిశ్రమకు ఎలాంటి సమస్య రాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఉన్న ఫార్మా పరిశ్రమలను ప్రత్యేకంగా క్లస్టర్లుగా విభజించి ఔటర్ రింగు రోడ్డు, రీజినల్ రింగు రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. ఔషధాల ఉత్పత్తి, ఎగుమతిలో ప్రపంచానికే హైదరాబాద్ నగరం కేరాఫ్ అడ్రస్‌గా మారిందని, ఇది తెలంగాణకు గర్వకారణమన్నారు. ఫార్మా రంగం 73వ కాన్ఫరెన్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన శుక్రవారం మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

ఫార్మా పరిశ్రమ రంగాన్ని ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో చూస్తుందని, అన్నింటినీ ఒకే చోటకు తరలించిన తర్వాత అవసరమైన విద్యుత్, నీటి సరఫరాకు గ్యారంటీ కల్పిస్తుందన్నారు. ప్రత్యేకంగా విద్యుత్ కోసం ప్రత్యేక పాలసీనే ప్రభుత్వం తేనున్నట్లు తెలిపారు. ఏ పరిశ్రమైనా విద్యుత్తు, నీరు కీలకమని, కొరత లేకుండా సరఫరా చేయడంపై ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉన్నదన్నారు. గ్రీన్ ఎనర్జీ పాలసీతో మిగులు విద్యుత్ ఉండేలా త్వరలోనే కొత్తం చట్టం కూడా రాబోతున్నదన్నారు. ఆరోగ్య సంరక్షణలో ఫార్మా రంగానికి ప్రత్యేక భూమిక ఉన్నదని, ఆ రంగం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఫార్మాసిస్టులు మాంత్రికులలాంటివారని, చిన్నచిన్న మాత్రలను ఆరోగ్యానికి శక్తివంతమైన ఏజెంట్లుగా వినియోగిస్తారంటూ చమత్కరించారు.

హైదరాబాద్ నుంచి ప్రతీ ఏటా సుమారు రూ. 50 వేల కోట్ల ఔషధాలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నామని, దేశం మొత్తంమీద ఉత్పత్తి అవుతున్న మందుల్లో దాదాపు 35% కేవలం తెలంగాణ నుంచే ఉన్నాయని వివరించారు. ఇండస్ట్రీ-ఫ్రెండ్లీ గవర్నమెంటుగా ఉన్నందున పరిశ్రమలకు ఎలాంటి సమస్యనూ రానివ్వమన్నారు. అత్యధిక నాణ్యతతో జనరిక్ మెడిసిన్‌ను ఉత్పత్తి చేసి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తూ తెలంగాణకు ఫార్మా ఇండస్ట్రీ ప్రత్యేక గుర్తింపు సాధించిందన్నారు. కరోనా సమయంలో ఫార్మాసిస్టులు అసమాన సేవలందరించారని, వ్యాక్సిన్ అందుబాటులోకి తేవడంలో ఈ రంగం కృషిని యావత్తు ప్రపంచమే గుర్తించిందన్నారు. హైదరాబాద్ బిర్యానీకి మాత్రమే కాక బయో ఫార్మాకు కూడా చిరునామాగా మారిందన్నారు.


Similar News