హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ లో భారీగా అక్రమాలు!
హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీలో అవినీతి రాజ్యమేలుతోంది. మొక్కల పేరిట రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. మూడేళ్లలో జరిగిన అవినీతి ఒక ఎత్తయితే.. కేవలం 2024లో జరిగింది మరో ఎత్తు.
దిశ, తెలంగాణ బ్యూరో: హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీలో అవినీతి రాజ్యమేలుతోంది. మొక్కల పేరిట రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. మూడేళ్లలో జరిగిన అవినీతి ఒక ఎత్తయితే.. కేవలం 2024లో జరిగింది మరో ఎత్తు. పాలిథిన్ బ్యాగుల నుంచి మొదలుకొని విత్తనాలు, మొక్కల వరకు అధికారుల ఇష్టారాజ్యం అనే విమర్శలున్నాయి. ఏటా రూ.120 కోట్ల వరకు ఖర్చు చేస్తూ వాటిలో రూ.60 కోట్లు మెక్కేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హెచ్ఎండీఏ పరిధిలోని నర్సరీల్లో ఎన్ని మొక్కలు పెంచుతున్నారు..? అనే లెక్కలు సైతం చెప్పకపోవడం విమర్శలకు తావిస్తోంది.
నాసిరకమైన బ్యాగులు
మొక్కలు పెంచేందుకు వినియోగిస్తున్న పాలిథిన్ బ్యాగులు నాసిరకంగా ఉంటున్నాయి. టెండర్ లేకుండానే 35 శాతం కమీషన్ తీసుకుని కాంట్రాక్ట్‌ను కట్టబెడుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. పాలిథిన్ బ్యాగులు చెక్ చేస్తే క్వాలిటీ ఉందో? లేదో? తెలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
60 శాతం మొక్కలకు 100 శాతం బిల్లులు
మొక్కల పేరుతో భారీగా నిధులు మెక్కేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గతేడాది మిగిలిన 40 శాతం మొక్కలను ఈ ఏడాదిలో పెంచినట్టు చూపిస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. ఈ ఏడాది 60 శాతం మొక్కలు పెంచి 100 శాతం బిల్లులు కాజేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెంచిన మొక్కల్లో 50 శాతం కూడా లేవని పలు నర్సరీలను పరిశీలిస్తే అర్థమవుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు.. 6 నుంచి 7 ఫీట్ల మొక్కకు రూ.60 ఖర్చు చేస్తుండగా.. 50 శాతం మొక్కలు 2 ఫీట్లకు కూడా మించడం లేదు. ఖర్చు మాత్రం రూ.60 నుంచి రూ.100 వేస్తున్నారని విమర్శలున్నాయి.
తనిఖీలు ఎక్కడ..?
నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం, పాలిథిన్ బ్యాగుల క్వాలిటీ, ఆరు ఫీట్ల మొక్కలు ఎన్ని ఉన్నాయి..? అంతకంటే తక్కువ సైజులో ఎన్ని ఉన్నాయి..? ఎంత మంది లేబర్ పనిచేస్తున్నారు? ఇలా అన్నింటిపై అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. కానీ.. ఆఫీసర్లే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తడం తో ఎలాంటి తనిఖీలు చేయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. తెల్లాపూర్ నర్సరీలో మేనేజర్‌ను పక్కనపెట్టి ఉన్నతాధికారులే స్వయంగా నర్సరీని పెంచుతున్నారని ప్రచారం జరుగుతున్నది. హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ లో జరుగుతున్న అవినీతిపై అటవీశాఖ ఉన్నతాధికారులు విచారణ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అధికారులే బినామీ కాంట్రాక్టర్ల పేరిట రూ.కోట్లు దండుకుంటున్నారని, అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలనే ఉన్నది. ఈ విషయంపై కొందరు సీఎం కార్యాలయానికి సైతం ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
ఎలాంటి విచారణకైనా సిద్ధం
అర్బన్ ఫారెస్ట్రీ లో అవినీతి జరుగుతున్నట్టు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. విత్తనాలు, మొక్కల కొనుగోలు వరకు అంతా టెండర్ ప్రక్రియ ద్వారానే చేస్తున్నాం. నాపై కావాలనే కొంతమంది తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నర్సరీల నిర్వహణలో వస్తున్న ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధం.:- ప్రదీప్ కుమార్ శెట్టి, అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్