Sridhar Babu: అడ్డుతగిలే ఊరుకోం.. మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరిక

రాష్ట్రంలో రౌడీయిజం చేస్తామంటే నడవదని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) హెచ్చరించారు.

Update: 2024-11-12 16:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రౌడీయిజం చేస్తామంటే నడవదని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) హెచ్చరించారు. మంగళవారం ఆయన అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతూ.. కొడంగల్ ఘటన(Kodangal incident)పై పూర్తి స్థాయిలో ఎంక్వైయిరీ చేస్తామన్నారు. అధికారుల వైఫల్యాలను కూడా వెలికితీస్తామన్నారు. లగచర్ల ఘటనలో ఎవరున్నా, ఊపేక్షించేది లేదని నొక్కి చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుతగిలే ఊరుకోమన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అభిప్రాయాలను తెలపడానికి వేదిక ఉంటుందని, తమ ప్రభుత్వం ప్రజాస్వామ్య స్పూర్తితో ముందుకు వెళ్తుందన్నారు. ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా ఎవరు చేస్తున్నారో ఆ కుట్రలను బయటపెడతామన్నారు. రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టి రాజకీయ లబ్ధి కోసం చేసే వారి కుట్రలను వెలికితీస్తామన్నారు.

పోలీస్, ఇంటెలిజెన్స్, ప్రభుత్వ అధికారుల్లో ఎవరి వైఫల్యం ఉందో విచారణ జరిపిస్తామన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కలెక్టర్ ఆలోచించారని, కానీ దురదృష్టవషాత్తు దాడి జరిగిందన్నారు. శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం స్పష్టంగా ఉన్నదని, శాంతిభద్రతలకు విఘాతం కల్గొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారన్నారు. మరో సారి రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి సంఘటనలు జరిగితే ఉరుకోమన్నారు. ఫార్మా కంపెనీ ఏర్పాటులో అభిప్రాయాలు  తెలుసుకోవడం కోసమే అధికారులు వెళ్లారన్నారు. ప్రజాభిప్రాయం ప్రకారమే ఫార్మా కంపెనీ విషయంలో ముందుకు వెళ్తామన్నారు. ఎవరికి ఎవరూ భయపడరని, తాము రాజకీయం చేయమని సూచించారు.

ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సారి జరిగిన గ్రూప్-1 పరీక్ష ను కూడా అడ్డుకునే ప్రయత్నం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రతిపక్షం గా ఉన్నప్పుడు ఏ నాడు ప్రభుత్వ కార్యక్రమాలు అడ్డుకోలేదని, కేవలం సలహా, సూచనలు మాత్రమే ఇచ్చామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తమ సూచనలు పట్టించుకోకపోతే న్యాయస్థానాలకు వెళ్తామన్నారు. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ అభిప్రాయాలు చెప్పదలుచుకుంటే వారికి ఆ ఏర్పాట్లు చేస్తామన్నారు. కేటీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్తారో అందరికీ తెలుసునని చురకలు అంటించారు. రాజకీయ ఇబ్బందులను అధిగమించడానికి కేటీఆర్ ఢిల్లీ లో మకాం వేశారన్నారు. బట్ట కాల్చి మీద వేసే పనిలో బీఆర్ఎస్ నాయకత్వం ఉన్నదన్నారు. ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కాకముందే కేటీఆర్, హరీష్ రావు విమర్శలు చేస్తున్నారన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ లో కాంగ్రెస్ గెలవబోతుందని ప్రకటించారు. జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు.

Tags:    

Similar News