Eatala Rajendar: రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు ఇలా తప్పించుకుంటావ్.. ఈటల ఘాటు విమర్శలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఈటల రాజేందర్ ఘాటు విమర్శలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఈ ఏడాది, వచ్చే ఏడాది అన్ని స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగబోతున్నాయని పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అనుభవం కలిగిన పెద్ద లీడర్లు సైతం లోకల్ బాడీ ఎన్నికల పోటీలో ఉండబోతున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని జేపీ నడ్డా, అమిత్ షా సైతం ఇదివరకే చెప్పారని అందువల్ల పార్టీ సభ్యత్వ నమోదు ప్రాముఖ్యతను అన్ని మోర్చాలు గుర్తించాలన్నారు. క్రవారం హైదరాబాద్ నాగోల్ లో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదుపై వర్క్ షాప్ ప్రోగ్రామ్ లో ఈటల మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలన చూశామని వీరిని భరించే స్థితిలో లేమని బీజేపీనే గట్టిగా పోరాటం చేయాలని ప్రజలు కోరుతున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో వెలిసిపోవడానికి ఐదేళ్లు పడితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం తొమ్మిది నెలలు కూడా పట్టలేదన్నారు. 2018 నాటికే కేసీఆర్ ను ప్రజలు చీదరించుకున్నా ప్రయత్యామ్నాయం లేక పోపోవడంతో మరో సారి గెలిచారన్నారు. అధికార పార్టీ కావడంతోనే గత స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు గెలుచుకోగలిగిందన్నారు.
ఎన్ని రోజులు ఇలా తప్పించుకుంటావ్:
హైడ్రా పేరుతో పేదల జోలికి వస్తానంటే అది మీ తరం కాదని, పేదల జోలికి వస్తే కబడ్దార్ అని ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. నిజంగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయే పనే చేయాలంటే ముందుగా బాధితులకు ప్రత్యామ్నాయంగా ఇళ్లు నిర్మించి ఇచ్చి అప్పుడు కూల్చివేయాలన్నారు. అంతే తప్పు ఆరు గ్యారెంటీల హామీలపై చర్చ జరగకుండా ఎన్ని రోజులు తప్పించుకుంటారో చూస్తామని మిస్టర్ హెచ్చరించారు. ఇవాళ మీరు తప్పించుకోవచ్చు కానీ ప్రజాక్షేత్రంలో మీకు శిక్ష తప్పదన్నారు. మీరు రెడ్ బుక్ రాస్తున్నానని గతంలో చెప్పావు, బీజేపీ తరపున మేము కూడా నీ చిట్టా అంతా రాసుకుంటున్నామని సందర్భం వచ్చినప్పుడు ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామన్నారు. రాజ్యంగబద్ధమైన పదవిలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు కామెంట్స్ చూస్తే ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎంత బాధ్యతారాహిత్యంగా, సంస్కారహీనంగా మాట్లాడుతున్నారో అర్థం అవుతున్నదన్నారు.
కొంత మంది సూడో మేధావులకు అది కనిపించకపోవచ్చు:
గతంలోనూ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నారని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి.. ఇప్పుడే కొత్త రాష్ట్రం ఏర్పడ్డట్లుగా, ఈయనే తొలి ముఖ్యమంత్రి అయినట్లుగా నా తమ్ముడైనా, నా పార్టీ వ్యక్తి అయినా వదిలిపెట్టనని రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికితే నమ్మెదెట్లా అన్నారు. రేవంత్ రెడ్డి చరిత్ర తెలియనిది కాదన్నారు. మీడియా, సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేయిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు తాత్కాలికంగా విజయం సాధింస్తారేమో కానీ దీర్ఘకాలంలో విజయం దక్కదన్నారు. కొంత మంది సూడో మేధావులకు హైడ్రా విషయంలో ఎన్ కన్వెన్షన్, కొంత మంది ఫామ్ హౌస్ లే కనిపిస్తుండవచ్చు కానీ అనేక చెరువుల వద్ద ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చిన నిరుపేదలు కనిపించడం లేదని మండిపడ్డారు. 40 ఏళ్లుగా ఉంటున్న వందల పేద ప్రజలు హైడ్రా పేరు వింటే వణికిపోతున్నారన్నారు. పాలకులు అనే వారు మారిన పరిస్థితులకు అనుగుణంగా చట్టాలు చేయాలి. చెరువు భూములన్ని ప్రభుత్వ భూములు కావని కొన్ని చెరువులు వంద శాతం ప్రైవేట్ భూములు ఉంటాయనే విషయం మర్చిపోవద్దన్నారు.