Hot News: రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదలు.. గులాబీ పార్టీ సైలెంట్!

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Update: 2024-09-03 02:10 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో ఫీల్డ్ విజిట్లతో ప్రజల్లో భరోసా కల్పించాల్సిన ప్రతిపక్ష బీఆర్ఎస్.. మీడియా ప్రకటనలకే పరిమితమైందనే విమర్శలు వస్తున్నాయి. ఆస్తి, ప్రాణ నష్టం జరిగినా గులాబీ నేతలు రాకపోవడాన్ని పలువురు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు.

కేటీఆర్ పిలుపునిచ్చినా..

ప్రజలు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పార్టీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే నలుగురైదుగురు ప్రధాన నేతలు మినహా మిగతా వారు పట్టించుకోకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. పార్టీకి 60 లక్షల మంది సభ్యత్వం ఉందని ఓ వైపు నేతలు చెబుతున్నా.. సహాయక చర్యల్లో వారు కనిపించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. పార్టీ అధికారంలో ఉన్నా పట్టించుకోకపోవడంతోనే ఇప్పుడు పార్టీ శ్రేణులు పార్టీ పిలుపును సీరియస్ గా తీసుకోవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఫీల్డ్ విజిట్‌లో నలుగురు, ఐదుగురు

ఉమ్మడి ఖమ్మంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఉమ్మడి నల్లగొండలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, ఉమ్మడి వరంగల్ లో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, గ్రేటర్ హైదరాబాద్ లో ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, కొందరు కార్పొరేటర్లు మాత్రమే వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఉమ్మడి నల్లగొండలో ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, మిగతా ప్రాంతాల్లో మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు దూరంగా ఉండడంపై విమర్శలు వస్తున్నాయి.

సైలెంట్‌గా కేసీఆర్

వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పార్టీ అధినేత కేసీఆర్ ఫాం హౌజ్ కే పరిమితం అయ్యారన్న విమర్శలు వస్తున్నాయి. ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతున్నా కేడర్ కు దిశానిర్దేశం చేయకపోవడం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపు నివ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలకు గడువు సమీపిస్తుండటం, ఇదే సమయంలో భారీ వర్షాలు కురవడంతో ప్రజల్లోకి యాక్టివ్ గా వెళ్లకపోవడం, మౌనంగా ఉండటంతో కేసీఆర్ ఏం చేయాలనుకుంటున్నారనే దానిపై కేడర్ లో మీమాంస నెలకొన్నది.

ప్రభుత్వంపై విమర్శలు రివర్స్

ఆపత్కాలంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న కేటీఆర్, హరీశ్ రావులకు మంత్రులు అదే స్థాయిలో సమాధానమిస్తున్నారు. రాజకీయం చేయడం మానుకోవాలని, చేతనైతే సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని మంత్రి పొంగులేటి సూచించారు. గత బీఆర్ఎస్ పాలకులు గడీల్లో పడుకున్నారని, ప్రజల్లోకి వచ్చే దైర్యం లేక కేటీఆర్, హరీశ్ రావు సోషల్ మీడియాలో రాజకీయంగా బతికేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి తీవ్రంగా స్పందించారు. మంత్రులు సైతం గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. బీఆర్ఎస్ చేసిన విమర్శలే తిరిగి వారికే ఫైర్ అవుతున్నాయని ఆ పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.


Similar News