TG Assembly: రద్దా.. పొడిగింపా? ‘జమిలి’తో అసెంబ్లీ కాల పరిమితిపై అనిశ్చితి
దేశవ్యాప్తంగా ఇప్పుడు జమిలి ఎన్నికలపైనే చర్చ నడుస్తున్నది. ఒకవేళ జమిలి ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే.. మన రాష్ట్రంలో ఎన్నికల పరిస్థితి ఏంటా అనేది హాట్‌టాపిక్ అయింది.
దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా ఇప్పుడు జమిలి ఎన్నికలపైనే చర్చ నడుస్తున్నది. ఒకవేళ జమిలి ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే.. మన రాష్ట్రంలో ఎన్నికల పరిస్థితి ఏంటా అనేది హాట్‌టాపిక్ అయింది. మన రాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి తగ్గుతుందా? లేక పెరుగుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. 2029 మే నెలలో జరిగే పార్లమెంట్ ఎన్నికలతోపాటే జమిలి ఎన్నికలు నిర్వహిస్తే, అసెంబ్లీ కాలపరిమితి 6 నెలలపాటు పెరుగుతుంది. అలాకాకుండా యూపీ ఎన్నికలతోపాటే 2027 ఏప్రిల్‌లో నిర్వహిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం అనే చెప్పాలి. ఎందుకంటే ఏడాదిన్నర ముందే అధికారాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఒకవేళ ముందుగానే ఎన్నికలు నిర్వహిస్తే లోకల్ బాడీ ఎన్నికల తరువాత వెంటనే అన్ని రాజకీయ పార్టీలు పూర్తిగా అసెంబ్లీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లక తప్పదు.
అదనంగా 6 నెలలు రేవంత్ సర్కారు!
ప్రస్తుత అసెంబ్లీకి 2028 డిసెంబరు 9 వరకు గడువు ఉంది. ఈలోపు ఎన్నికలు జరిగి కొత్త అసెంబ్లీ కొలువు తీరాలి. కానీ 2029 మేలో పార్లమెంట్ ఎన్నికలతో పాటే జమిలి నిర్వహిస్తే, అప్పటివరకు మన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాల్సి ఉంటుంది. దీంతో రేవంత్ రెడ్డి సర్కారుకు డిసెంబరు 9, 2028 నుంచి మే 2029 వరకు అదనంగా మరో 6 నెలలపాటు అధికారంలో కొనసాగే అవకాశం దక్కుతుంది. అలాకాకుండా అసెంబ్లీ గడువు ముగిసిన వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టి పార్లమెంట్‌తోపాటే జమిలి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందనే వాదనలు కూడా ఉన్నాయి. కానీ.. జమిలికి ముందే అసెంబ్లీల కాలపరిమితి ముగుస్తున్న రాష్ట్రాల్లో ప్రెసిడెంట్ రూలింగ్ పెడితే రాజకీయ విమర్శలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ విషయాలను ముందుగానే గ్రహించిన బీజేపీ అగ్రనాయకత్వం రాష్ట్రపతి పాలన జోలికి వెళ్లకుండా అసెంబ్లీల కాలపరిమితిని పొడిగించేందుకు మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
ముందే నిర్వహిస్తే నష్టం
2027 ఏప్రిల్‌లో యూపీ, గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరఖండ్ అసెంబ్లీలతోపాటు 2027 నవంబరులో గుజరాత్, హిమచల్‌ప్రదేశ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ అసెంబ్లీలతోపాటే జమిలి ఎన్నికలు నిర్వహించే విధంగా కేంద్రం చట్ట సవరణలు చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ అప్పుడే జమిలి జరిగితే మన రాష్ట్ర అసెంబ్లీని గడువుకంటే ముందుగానే రద్దు చేయాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనితో సీఎం రేవంత్ ప్రభుత్వం ఏడాదిన్నర ముందే అధికారం కోల్పోవాల్సి వస్తుందని ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ అదే అమలైతే స్థానిక సంస్థల ఎన్నికల తరువాత అన్ని రాజకీయ పార్టీలు జమిలి ఎన్నికలపై ఫోకస్ పెట్టాల్సి వస్తుందని చర్చ జరుగుతున్నది.
ముందే ఎన్నికలు కోరుకుంటున్న విపక్షాలు
జమిలి ఎన్నికలు 2027లో ఏప్రిల్‌లో నిర్వహిస్తే బాగుండని బీఆర్ఎస్, బీజేపీలు ఆశపడుతున్నాయి. ముందు నిర్వహించడం వల్ల రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తామని ధీమాతో ఆ రెండు పార్టీల లీడర్లు ఉన్నారు. అలా కాకుండా ఆరు నెలలపాటు అసెంబ్లీ గడువు పెరిగితే, కాంగ్రెస్ ప్రభుత్వానికి మరింత సమయం దొరుకుతుందని, ప్రజల్లో పాజిటివ్ మూడ్ పెంచుకునే అవకాశం ఉన్నదని టాక్.