TG assembly: నాకు తెలుసు మీరు కూర్చొండి.. ఎమ్మెల్యేకు మంత్రి తుమ్మల పంచ్
సభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేకు మంత్రి తుమ్మల కౌంటర్ ఇచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో : రైతు రుణమాఫీపై అసెంబ్లీలో (Telangana Assembly) అధికార ప్రతిపక్షాల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా ఇవాళ ప్రతిపక్ష సభ్యుల వాదనపై శాసనసభలో మంత్రి తుమ్మల (Minister Thummala) మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు విడతల వారీగా రుణమాఫీ చేస్తే వడ్డీలకే సరిపోలేదని విమర్శించారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక ఎన్నికలకు మూడు నెలల ముందు రుణమాఫీ ప్రారంభించగా, అందులో సగంమందికి రుణమాఫీ కాకపోతే ఆ భారాన్ని కూడా తమ ప్రభుత్వమే భరించిందన్నారు. కుటుంబానికి రూ. 2 లక్షల పంట రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం అని, ఈ మేరకు ఈ రోజు వరకు రూ. 20 వేల కోట్లు రిలీజ్ చేశామని వెల్లడించారు. మార్చి 31లోపు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. రైతులను మోసం చేసినవాళ్లు, దగా చేసినవాళ్లు, ముంచిన వాళ్లు రుణమాఫీ గురించి మాట్లాడితే అసహ్యించుకుంటారని, ప్రజల్లో అపహాస్యం పాలవుతారని మంత్రి పేర్కొన్నారు.
ఇలాంటి పరిస్థితిని ఊహించలేదు : పాయల్ శంకర్
11 ఏళ్లలోనే రాష్ట్రానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌శంకర్ (Payal Shankar) అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం దుబారాలకు పోయిందని, సీఎంవోలో పని చేసే అధికారులు 200 కి.మీ ప్రయాణానికి హెలికాప్టర్ ప్రయాణాలు చేశారని విమర్శించారు. రుణమాఫీపై గతంలో బీఆర్ఎస్ మాట తప్పితే కాంగ్రెస్ అమలు చేస్తుందేమో అని భావించామని, కానీ కేవలం రూ.20 వేల కోట్ల రుణమాఫీ మాత్రమే చేశారని అన్నారు. అర్హత ఉన్నా అనేకమంది రైతులకు పంట రుణాలు మాఫీ కాలేదన్నారు.
పల్లాగారు మీరు కూర్చోండి..
సభలో తుమ్మల మాట్లాడుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కామెంట్ చేశారు. దీంతో ‘పల్లాగారు రైతుబంధు అధ్యక్షుడిగా రైతుబంధు గురించి నాకు తెలుసు.. మీరు కూర్చోండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ వాయిదా తీర్మానం..
ఇవాళ సభ ప్రారంభం కాగానే రూ. 2 లక్షల సంపూర్ణ రుణమాఫీ కోసం బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ చేయాలని కోరుతూ చర్చకు బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్‌కు వాయిదా తీర్మానం ఇచ్చారు.