BRS ఎంపీ అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన.. వణికిస్తున్న ఆ రెండు అంశాలివే..!

లోక్‌సభ ఎన్నికల గడువు దగ్గరపడుతుండగా.. ఒక్కొక్కరుగా గులాబీ నేతలు పార్టీని వీడుతున్నారు.

Update: 2024-04-17 02:06 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల గడువు దగ్గరపడుతుండగా.. ఒక్కొక్కరుగా గులాబీ నేతలు పార్టీని వీడుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో చేరుతున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొన్నది. విజయంపై అనుమానం వ్యక్తమవుతున్నది. అందుకే ప్రచారాన్ని ముమ్మరం చేయలేదనే చర్చ జరుగుతున్నది. కేవలం నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలతోనే సరిపుచ్చుతున్నారనే ప్రచారం ఉన్నది. వాటిలో సైతం కీలక నేతలను కలుపుకొని వెళ్లకపోవడం, ఫ్లెక్సీల్లో సీనియర్ల ఫొటోలు పెట్టకపోవడం, సమావేశాల్లో తమ పేర్లను చెప్పకపోవడంతో చాలా మంది అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది.

ఖర్చుకు వెనకాడుతూ..

లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలో కనీసం ఆరేడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎలక్షన్స్‌లోనే ఒక్కో అభ్యర్థి సుమారు రూ. 50 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ప్రచారం జరిగింది. దీంతో లోక్‌సభలో పోటీ చేసే అభ్యర్థులు ఏ మేరకు ఖర్చు చేయాల్సి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, పోటీ చేసినా గెలుస్తామనే నమ్మకం లేకపోవడంతో బీఆర్ఎస్ అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడుతున్నట్లు తెలుస్తున్నది. ఓడిపోతే భారీగా నష్టపోవాల్సి వస్తుందని భావించి ఖర్చు పెట్టడం లేదని తెలిసింది. ఖర్చులన్నీ పార్టీయే భరిస్తుందని అధినేత కేసీఆర్ చెప్పినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదని తెలుస్తున్నది. అందుకే అభ్యర్థులు గ్రామాల్లోకి వెళ్లకుండా.. నియోజకవర్గ కేంద్రాలకే పరిమితమవుతున్నట్లు సమాచారం.

ముఖం చాటేస్తున్న అభ్యర్థులు!

తమ సమస్యలు విన్నవించుకుందామని వచ్చే నేతలకు అభ్యర్థులు మొఖం చాటేస్తున్నట్లు తెలిసింది. కులసంఘాలు సైతం కలిసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పార్టీ సమావేశం ఉందని, అక్కడి వస్తే మాట్లాడుకుందామని చెబుతున్నట్లు సమాచారం. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత చూద్దాం.. చేద్దామంటూ దాటవేస్తున్నారని, సమస్యలను విన్నవించుకుందామని, సాయం అడుగుదామని అనుకున్నవారికి నిరాశే ఎదురవుతోంది. దీంతో నేతలంతా అభ్యర్థుల తీరుపై ఆగ్రహంతో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

అభ్యర్థులను మారుస్తున్నారంటూ..

అభ్యర్థుల గురించి పార్టీ సర్వేలు నిర్వహించింది. అందులో భాగంగానే లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రైవేటు సంస్థలతో నిర్వహిస్తున్న సర్వేల్లో కొంతమంది అభ్యర్థులపై పాజిటివ్ లేదని సమాచారం. ఎక్కడెక్కడ పార్టీకి సానుకూలంగా లేదో ఆయా నియోజకవర్గ ముఖ్య నేతలకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం. ఏయే అంశాలతో ప్రజల్లోకి వెళ్తే పాజిటివ్ వస్తుంది? ప్రభుత్వ వైఫల్యాలను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే వాటిపైనా నేతలకు సూచనలు ఇస్తున్నట్లు సమాచారం. సర్వే రిపోర్టుల ఆధారంగా పనితీరును మెరుగు పర్చుకోవాలని, లేకుంటే మారుస్తామనే సంకేతం ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదికూడా అభ్యర్థులు ఖర్చు పెట్టేందుకు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. ఖర్చుచేసి ప్రచారం చేస్తే చివరకు పార్టీ బీఫాం ఇవ్వకపోతే నష్టపోతామని భావిస్తున్నట్లు సమాచారం.

నల్లగొండ ఎంపీ అభ్యర్థి తేరా అంటూ ప్రచారం

నల్లగొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డిని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఆయన ప్రచారం సైతం ప్రారంభించారు. అయినప్పటికీ ఆయనను మారుస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. సర్వేల్లో కంచర్లకు ఆశించిన పాజిటివ్ రాలేదని, దీంతో మరొకరికి అవకాశం కల్పిస్తున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. ఎంపీ అభ్యర్ధిగా తేరా చిన్నప రెడ్డిని ఎంపికగా చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది. తేరా ఇప్పటికే పార్టీకి రాజీనామా చేయగా.. అయినప్పటికీ ఆయన పేరు మళ్లీ తెరమీదకు రావడం చర్చకు దారితీసింది. మరోవైపు గుత్తా అమిత్ రెడ్డికి సానుకూలంగా కొంతమంది నేతలు పార్టీ అధినేతకు లేఖ రాశారని తెలిసింది. దీనిపై కంచర్ల మాత్రం క్లారిటీ ఇచ్చారు. కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, తామే బరిలో ఉంటామని పేర్కొంటున్నారు. కేసీఆర్ చేతుల మీదుగా బీఫాం అందుకోబోతున్నామని వెల్లడించారు. తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని కోరారు. ఇదిలా ఉంటే తేరా చిన్నపరెడ్డి మాత్రం పార్టీ టికెట్ ఇస్తే పోటీచేస్తానని పేర్కొంటుండటం గమనార్హం. అయితే పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందనేది పార్టీ నేతల్లో చర్చనీయాంశమైంది.


Similar News