జనగామ మున్సిపల్‌లో కొనసాగుతున్న హై డ్రామా.. రంగంలోకి కేటీఆర్!
జనగామ మున్సిపల్ వ్యవహారం రోజుకో కొత్తమలుపు తిరుగుతోంది.
జనగామ మున్సిపల్ వ్యవహారం రోజుకో కొత్తమలుపు తిరుగుతోంది. అధికార పార్టీ కౌన్సిలర్లే అసమ్మతి రాగం ఆలపించడంతో అధిష్టానం దృష్టిసారించినట్లు తెలిసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి ఫోన్ చేసి సీరియస్ అయినట్లు సమచారం. అసమ్మతి వాదులను బుజ్జగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మరోవైపు క్యాంపు రాజకీయం మూడు రోజులకు చేరుకుంది. కౌన్సిలర్ బండ పద్మ నేతృత్వంలో కౌన్సిలర్లు భువనగిరిలోని ఓ హోటల్లో బసచేశారు. చైర్ పర్సన్, వైస్ చైర్మన్, ఫ్లోర్ లీడర్‌లను మార్చాలని, లేకుంటే అవిశ్వాసం పెడతామని హెచ్చరికలు జారీ చేశారు.
మరోవైపు శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ జమున లింగయ్య దంపతులు, తిరుగుబాటు కౌన్సిలర్ బండ పద్మ యాదగిరి రెడ్డి దంపతులు హైదరాబాదులో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని వేర్వేరుగా కలిసి గోడు వెల్లబోసుకున్నట్లు తెలిసింది. ఇరువర్గాలకు ఎమ్మెల్యే నచ్చజెప్పారని, ఈ వ్యహారంపై అధిష్టానం సీరియస్‌గా ఉందని హితబోధ చేశారని వినికిడి. మొత్తంగా ఒకటి రెండు రోజుల్లో జనగామ మున్సిపల్ వ్యవహారానికి పుల్ స్టాప్ పడేలా ఉందనే చర్చ జరుగుతోంది.
దిశ, జనగామ : జనగామ మున్సిపాలిటీలో జరుగుతున్న అసమ్మతి కౌన్సిలర్ల క్యాంపులపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టి సారించినట్లు సమాచారం. జనగామతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా విశ్వాసం పెట్టే ప్రసక్తే లేదని, ఈ విషయంలో ఎమ్మెల్యేలు చొరవ తీసుకొని సమ్మతి వాదులను బుజ్జగించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. మూడు రోజులుగా జనగామలోని 19వ వార్డు కౌన్సిలర్ బండ పద్మ నేతృత్వంలో పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు క్యాంపునకు వెళ్లారు. తమకు సరైన గౌరవం దక్కడం లేదని, చైర్ పర్సన్, వైస్ చైర్మన్, ఫ్లోర్ లీడర్‌ను మార్చాలంటూ, లేకపోతే అవిశ్వాసం పెడతామని సొంత పార్టీ కౌన్సిలర్లు తిరుగుబాటు జెండా ఎత్తారు.
మూడు రోజులుగా హైడ్రామా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఆయా మున్సిపాలిటీల చైర్మన్లు కేటీఆర్‌ను కలిసి జరుగుతున్న పరిణామాలను వివరించారు. దీంతో మంత్రి కేటీఆర్ ఎక్కడైతే అవిశ్వాస సెగలు రగులుతున్నాయో వారితో మాట్లాడాలని సంబంధిత ఎమ్మెల్యేలు, పార్టీ అధ్యక్షులు, సమన్వయకర్తలను ఆదేశించినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే శుక్రవారం జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున లింగయ్య దంపతులు, తిరుగుబాటు కౌన్సిలర్ బండ పద్మ, యాదగిరి రెడ్డి దంపతులు హైదరాబాదులో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని వేర్వేరుగా కలిసి తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకు వెళ్లినట్లు కూడా తెలిసింది.
ఈ క్రమంలో మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే అనేక సాంకేతిక కారణాలు అడ్డువస్తున్నాయని, దీనికి తోడు అధిష్టానం సొంత పార్టీలో ఇలాంటి వ్యవహారాలపై అసంతృప్తిగా ఉన్నట్లు ఎమ్మెల్యే వారికి చెప్పి పంపించినట్లు కూడా తెలుస్తుంది. దీంతో ఏం చేయాలనే కోణంలో తిరుగుబాటు నేత బండ పద్మ ఆచలోచనలో పడ్డట్లు సమాచారం. ఇదిలా ఉంటే శుక్రవారం జనగామ నుంచి కౌన్సిలర్ సురేష్ రెడ్డి, మరొకరు ఆ పార్టీ నేత అసమ్మతి కౌన్సిలర్లు ఉన్న దీప్తి హోటల్ క్యాంపునకు వెళ్లి చర్చలు జరిపినట్లు కూడా సమాచారం.
ఇవి కౌన్సిలర్ల డిమాండ్లు..
జనగామ చైర్ పర్సన్ పోకల జమునను, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్, ఫ్లోర్ లీడర్ పాండును మార్చాలంటూ అసమ్మతి కౌన్సిలర్లు చర్చలకు వెళ్లిన దూతలతో వెల్లడించినట్లు సమాచారం. అయితే చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం పెట్టాలంటే సాంకేతిక కారణాలు అడ్డువస్తున్నాయని, దీనికి తోడు మంత్రి కేటీఆర్ సహా అధిష్టానం ఇలాంటి వ్యవహారంపై గుర్రుగా ఉందని సదరు దూత కౌన్సిలర్లకు వివరించినట్లు సమాచారం. చైర్ పర్సన్ పై అవిశ్వాసం కుదరకపోతే కనీసం వైస్ చైర్మన్‌ను, ఫ్లోర్ లీడర్లను తప్పించాలని, లేని పక్షంలో తాము రాజీ పడలేమని తేల్చి చెప్పినట్లు తెలిసింది.
ఒక వైపు చర్చలు జరుగుతుండగా మరొకవైపు మంత్రి దేశాలతో ఎమ్మెల్యే సైతం కౌన్సిలర్లకు గట్టిగానే కౌన్సిలింగ్ ఇచ్చే దిశగా కృషి చేసే ప్రయత్నం మొదలుపెట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎమ్మెల్యేతో కూడా తిరుగుబాటు కౌన్సిలర్లు తమ అభిప్రాయాలను వెల్లడించి, చైర్ పర్సన్ తీరు మారేలా, తమకు గుర్తింపు వచ్చే విధంగా వార్డుల్లో అభివృద్ధి పనులు జరిగే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. బేరసారాల వ్యవహారం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. దీంతో కౌన్సిలర్లు శాంతించినట్లు తెలుస్తుంది.
ఒకటి రెండు రోజుల్లో హైడ్రామాకు తెర..
మున్సిపల్ కౌన్సిలర్ల తిరుగుబాటుపై అధిష్టానం సీరియస్‌గా ఉండడంతో అలక బూనిన కౌన్సిలర్లను బుజ్జగించే యత్నాలు ప్రారంభమైనట్లు తెలుస్తుంది. శుక్రవారం రాత్రి వరకు చర్చలు కొనసాగాయి. ఈ క్రమంలో కౌన్సిలర్లు కొంత శాంతించినట్లు సమాచారం. తిరుగుబాటు కౌన్సిలర్లు ప్రధాన డిమాండ్లలలో మూడు అంశాలు ఉన్నట్లు సమాచారం. వాటిలో చైర్పర్సన్, వైస్ చైర్మన్‌ను మార్చడం అనేది వీలు కాకపోవచ్చని, ఇది సాంకేతికతతో ముడిపడి ఉందని కౌన్సిలర్లకు సూచించడంతో ఫ్లోర్ లీడర్‌ను ఎట్టి పరిస్థితుల్లో తప్పించాలని, తమకు సరైన గౌరవం లభించేలా చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ను మధ్యవర్తి ముందు ఉంచినట్లు తెలుస్తోంది. దీంతో ఈ హైడ్రామాకు ఒకటి రెండు రోజుల్లో తెరపడనున్నట్లు సమాచారం. ఏమైనా జనగామ మున్సిపల్ వ్యవహారం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.