అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోండి: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోవాలని సీఎల్పీ నాయకుడు, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దిశ, వేలేరు, (ధర్మసాగర్): అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోవాలని సీఎల్పీ నాయకుడు, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ధర్మసాగర్ మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన ధర్మసాగర్ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు, అకాల వర్షాలతో ధాన్యాన్ని పరిశీలించి, పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వడగండ్ల వానలతో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ రైతాంగాన్ని వదిలేసి సీఎం కేసీఆర్ మహరాష్ట్రలో బీఆర్ఎస్ సభలు నిర్వహిస్తున్నారని సీఎం కేసీఆర్ కు రైతులపై ఎంత ప్రేమ ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధర కు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని, కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే సంతోషంగా ఉందని అన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ, బీఆర్ఎస్ లను తరిమి కొట్టాలని కోరారు. పేపర్ లీకేజీలో బీఆర్ఎస్ నాయకులదే ముఖ్య పాత్ర అని అన్నారు.
సీఎం కేసీఆర్ చేస్తున్న తప్పిదాలు తెలంగాణ అభివృద్ధికి గుదిబండగా మారాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో ప్రవేశ పెట్టిన ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కులను కేంద్రం వద్ద గట్టిగా మాట్లాడలేకపోవడానికి అడ్డువస్తున్న తప్పిదాల వల్ల అంతిమంగా రాష్ట్రం నష్టపోతున్నదని అన్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అమలుకు నోచుకోకపోవడం దురదృష్టకరం అని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కావాలనే జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఏర్పాడుతాయని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పెద్ద భ్రమ అని, కాళేశ్వరం ద్వారా ఒక ఎకరానికి కూడా సాగునీరు రాలేదని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ చేసిన ప్రకటన గురించి బండి సంజయ్ మాట్లాడకుండా తెలంగాణలో అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట్లాడడం విడ్డూరం అని అన్నారు. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందా? లేదా? దేశంలో ఉద్యోగాలు భర్తీ చేయనివారు రాష్ట్రంలో ఎట్లా చేస్తారని ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ తీసుకువచ్చి సామాన్యులను బతికే పరిస్థితి లేకుండా చేశారు.
రాహుల్ గాంధీపై పార్లమెంట్ అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, ధరణి పేరిట భూస్వామ్య వ్యవస్థను తిరిగి తీసుకువచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, హన్మంతరావు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి, భద్రాచలం ఎంఎల్ఏ పోడెం వీరయ్య, నియోజకవర్గ ఇంచార్జి సింగపురం ఇందిర, టీపీసీసీ సభ్యులు గంగారపు అమృతరావు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు బొల్లెపల్లి కృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు గుర్రపు ప్రసాద్, ఎంపీటీసీలు రొండి రాజు, జాలిగపు వనమాల, సీనియర్ నాయకులం తెలంగాణ అమరేందర్ రెడ్డి, లింగాల జగదీష్ చందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.