Cm Review: భారీ వరదలు.. వారికి పరిహారం పెంచుతూ రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

వరద మృతులకు ఎక్స్ గ్రేషియో పెంచుతూ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-09-02 07:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియోను పెంచారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.4 లక్షల ఆర్థిక సాయం రూ.5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలకు పరిహారం పెంచాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు వేగంగా పరిహారం అందించాలని అధికారులను ఆదేశిచారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నిర్వహించిన ఈ సమీక్షకు మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సహాయక బృందాలు చేపడుతున్న చర్యలపై ముఖ్యమంత్రి అధికారులను ఆరా తీశారు. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాల్లోని కలెక్టరేట్లలో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని అందుకోసం అవసరమైన వ్యవస్థను కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవల కోసం రాష్ట్రంలోని 8 పోలీసు బెటాలియన్లకు ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలకు జరిగిన నష్టంపై తక్షణమే అధికారులు స్పందించాలన్నారు. వర్షాల సమయంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా కమిషనర్లు చర్యలు తీసుకోవాలని, వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను తక్షణమే మరమ్మతులు చేయాలని సీఎం ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో తలెత్తే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. భారీ వర్షాలతో ప్రభావితమైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్లలకు తక్షణ సాయం కోసం 5 కోట్లు మంజూరు చేశారు. సమీక్ష అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రోడ్డు మార్గం ద్వారా సీఎం ఖమ్మంకు బయలుదేరారు. ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలించనున్నారు.

జాతీయ విపత్తుగా పరిగణించండి.. మోడీకి సీఎం లేఖ:

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరదలను జాతీయ విపత్తుగా పరిణగణలోకి తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. వర్షాలతో రాష్ట్రం తీవ్రంగా ప్రభావితం అయిందని తక్షణమే కేంద్ర సాయం అందించాలని కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. వరద నష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు.

వైఎస్సార్ కు నివాళి:

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వైఎస్సార్ కు నివాళి అర్పించారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో వైఎస్సార్ చిత్రపటానికి రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. 'పేదల హృదయాల్లో … తడి ఆరని సంక్షేమ సంతకం…తెలుగు ప్రజల మనసుల్లో… అభిమానపు ప్రతిరూపం' అంటూ వైఎస్సార్ ను స్మరించుకుంటూ సీఎం ట్వీట్ చేశారు.


Similar News