అనుమానితులను గుర్తించండి.. సత్వరగా చికిత్సను అందించాలి
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో అనుమానితులను గుర్తించి వేగంగా వైద్యం అందించాలని ఆమె ఆదేశించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో అనుమానితులను గుర్తించి వేగంగా వైద్యం అందించాలని ఆమె ఆదేశించారు. శుక్రవారం ఆమె వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిస్టినా చొంగ్తూ మాట్లాడుతూ..జ్వర సర్వే నిర్వహించి డెంగీ, మలేరియా అనుమానితులను గుర్తించాలన్నారు. సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బ్లడ్ శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించాలన్నారు.
మూడు రోజుల కంటే ఫీవర్ కలిగిన బాధితులందరికీ టెస్టులు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆశాలు, ఏఎన్ ఎంలు ఇంటింటికి తిరిగి ప్రజల ఆరోగ్యంపై ఆరా తీయాలన్నారు. ఇక ప్రతి పీహెచ్ సీలో సీజనల్ వ్యాధుల డ్రగ్స్ స్టాక్ ఉండాలని, రాబోయే మూడు నెలల పాటు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదన్నారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ ఆర్ వీ కర్ణన్, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ ఉన్నతాధికారి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.