KTR: కేటీఆర్ ముందు చూపుకు హ్యాట్సాఫ్.. అసలు పెట్టని కంపెనీలతోనే ఎంవోయూ.. నెట్టింట విమర్శలు
రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు మధ్య విమర్శల వార్ జరుగుతోంది.
దిశ, డైనమిక్ బ్యూరో: రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు మధ్య విమర్శల వార్ జరుగుతోంది. అధికార ప్రతిపక్షాలు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తెలంగాణలో పెట్టుబడుల కోసం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారుల బృందంతో వీదేశీ పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా పలు కంపెనీలతో చర్చలు జరుపుతూ.. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఎంవోయూలు కుదుర్చుకుంటున్నారు. అయితే ఈ ఎంవోయూల పట్ల సీఎం రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పలు ఆరోపణలు చేస్తున్నారు. 15 రోజుల కంపెనీతో ఎంవోయూ ఎలా చేసుకుంటారని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు విదేశీ పర్యటనల పేరుతో కాలయాపన చేస్తున్నారని, పేరుకే ఎంవోయూ చేసుకుంటున్నారని వాటికి పెట్టుబడులు పెట్టేంత స్థోమత లేదని పలు రకాల ఆరోపణలు చేస్తున్నారు.
దీనిపై కాంగ్రెస్ పార్టీ వర్గాలు స్పందిస్తూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్ కురుర్చుకున్న ఎంవోయూలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కేటీఆర్ అసలు పెట్టని కంపెనీలతో ఎంవోయూలు చేసుకున్నారని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనిపై ఓ నెటిజన్ కేటీఆర్ గతంలో ఐటీ మంత్రిగా అంతా గోల్‌మాల్! చేశారని, అసలు పెట్టని కంపెనీతోనే ఎంవోయూ చేసుకున్నారని అన్నారు. జూన్ 10, 2022న భువి బయోకెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ , ధాత్రి బయోసిలికేట్స్ కంపెనీలతో కేటీఆర్ ఎంవోయూ చేసుకున్నారని, ఈ మేరకు రూ.1200 కోట్ల పెట్టుబడులంటూ ప్రకటించారని చెప్పారు.
కానీ భువి బయోకెమికల్స్ జులై 14, 2022న రిజిస్టర్ కాగా.. ధాత్రి బయో సిలికేట్స్ జులై 19, 2022న రిజిస్టర్ అయ్యిందని ఆధారాలను పోస్ట్ చేశారు. జులైలో పెట్టిన కంపెనీతో జూన్‌లోనే ఎలా ఎంవోయూ చేసుకున్నారని కేటీఆర్ ను నిలదీశారు. అలాగే మరో నెటిజన్.. మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ అసలు మొదలు పెట్టని కంపెనీతో ఎంవోయూ చేసుకున్నాడని, కేటీఆర్ ముందుచూపుకు హ్యాట్యాఫ్ అని ఎక్స్ లో పోస్ట్ చేశాడు. దీనికి సంబందించి కేటీఆర్ 2022 జూన్ 22న ట్విట్ట్ చేసిన ఫోటో సహా ప్రముఖ పత్రిక ప్రచురించిన కథనాన్ని, కంపెనీలు రిజిస్టర్ అయిన పత్రాలను ఆధారాలుగా చూపిస్తున్నారు.